మధూకర్‌ ఆత్మహత్య బాధ్యులపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మధూకర్‌ ఆత్మహత్య బాధ్యులపై చర్య తీసుకోవాలి

Oct 15 2025 6:32 AM | Updated on Oct 15 2025 6:32 AM

మధూకర్‌ ఆత్మహత్య బాధ్యులపై చర్య తీసుకోవాలి

మధూకర్‌ ఆత్మహత్య బాధ్యులపై చర్య తీసుకోవాలి

గోదావరిఖని: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్‌ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరారు. మంగళవారం గోదావరిఖనికి చేరుకున్న రాంచందర్‌రావు.. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝాను కలిశారు. ఆయనకు ఒక వినతిపత్రం అందజేశారు. మధూకర్‌ ఆత్మహత్య వెనుక కాంగ్రెస్‌ నాయకుల ప్రమేయం, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా నీల్వాయి కొత్తగూడకాలనీలో కొందరు డీజేలతో దద్దరిల్లే సౌండ్స్‌ పెట్టి రాజకీయ నేతల పాటలతో స్థానికులకు ఇబ్బంది కలిగించారని, దీనిపై కాలనీవాసులు మధూకర్‌కు మొరపెట్టుకోగా ఆయన ఎస్సైకి పలుసార్లు ఫోన్‌చేశారని, ఆయినా ఎస్సై స్పందించలేదని ఆరోపించారు. డయల్‌ 100 నంబరుకు కాల్‌ చేయడంలో పోలీసులు వచ్చి డీజే సౌండ్స్‌ బంద్‌ చేయించారన్నారు. కక్షగట్టిన రుద్రపట్ల సంతోష్‌, ఆయన అనుచరులతో మధూకర్‌పై దాడి చేయించారని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ మహిళతో తప్పుడు ఫిర్యాదు చేయించారని, బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా మధూకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బెదిరింపులకు గురిచేశారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల దాడి, పోలీసుల బెదిరింపు తట్టుకోలేక తీవ్రమనస్థాపానికి గురై మధూకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో వెల్లడించారు. రుద్రపట్ల సంతోష్‌, గాలి మధుతోపాటు 13మందిపై కేసు నమోదు చేసినా.. ఇంకా అరెస్ట్‌ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడి, నాయకులు సుభాష్‌, భరత్‌ప్రసాద్‌, వెంకటేశ్‌గౌడ్‌, గంగడి కృష్ణారెడ్డి, బోర్లాకుంట వెంకటేశ్‌నేత, గోమాస శ్రీనివాస్‌, కందుల సంధ్యారాణి, కోమల మహేశ్‌, సోమారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్టీపీసీ జ్యోతిభవన్‌కు చేరుకున్న రామచంద్రరావును ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం, కార్మిక సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాగర్‌రాజు, అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీ చల్లా సత్యనారాయణరెడ్డి ఘనంగా సన్మానించారు.

రామగుండం రైల్వేస్టేషన్‌లో వీడ్కోలు

రామగుండం: తిరుగు ప్రయాణానికి దానాపూర్‌ రైలులో హైదరాబాద్‌ వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్‌ చేరుకున్న రామచంద్రరావుకు బీజేపీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.

కాంగ్రెస్‌ కనుసన్నల్లో పోలీసులు

కాంగ్రెస్‌ పార్టీ కనుసన్నల్లోనే రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. తమ నాయకుడు మధూకర్‌ మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. కాంగ్రెస్‌ ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా ఐక్యంగా ఎదుర్కొందామన్నారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతుందని భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పెట్టుకుంటే మూల్యం చెల్లించకతప్పదని, తమపై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. తమ నాయకుడు మధూకర్‌ ఆత్మహత్యపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్నవారందరినీ అరెస్ట్‌ చేయాలని, ఇందుకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. లేనిపక్షంలో బీజేపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

రామగుండం పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement