విష ప్రయోగంతోనే వృద్ధుడు మృతి? ఇంకా ఆస్పత్రిలోనే వృద్ధురాలు వీడని గర్శకుర్తి దంపతుల మిస్టరీ అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో చోటు చేసుకున్న వృద్ధదంపతులు స్పృహకోల్పోయిన ఘటనలో విషప్రయోగం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా.. గురువారం వరకు కూడా ఇంకా కొలిక్కి రానట్లు సమాచారం. గర్శకుర్తికి చెందిన గజ్జెల శంకరయ్య, లక్ష్మి దంపతులు బీసీ కాలనీ సమీపంలో ఇంట్లో ఇద్దరే ఉంటారు. మంగళవారం ఉదయం మార్కెట్‌కు వెళ్లిన శంకరయ్య బోటి తీసుకొచ్చాడు. సాయంత్రమైనా దంపతులు ఇంటిబయటికి రాకపోవడంతో సమీప కుటుంబాలవారు వెళ్లి చూడగా.. బోటి శుభ్రం చేసే చోట శంకరయ్య, వంటగదిలో లక్ష్మి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. గ్రామస్తులు అంబులెన్సులో కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. అయితే దంపతులపై విషప్రయోగం చేసి లక్ష్మి మెడలోని పుస్తెలతాడు, బీరువాలోని మరో బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ పని తెలిసిన వారు చేశారా..? గుర్తు తెలియనివారు చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
దుండగులా..? తెలిసినవారా..?