
విషజ్వరంతో చిన్నారి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన
జగిత్యాలక్రైం: విషజ్వరంతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతిచెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి శ్రీధర్, అలేఖ్య దంపతులకు ఆరాధ్య (6), ఆదిత్య సంతానం. శ్రీధర్, అలేఖ్య దుబాయ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ విజయ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆరాధ్యకు విషజ్వరం రావడంతో విజయ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతిచెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. పట్టణ సీఐ కరుణాకర్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి బంధువులతో మాట్లాడి మృతదేహాన్ని బాలపల్లి గ్రామానికి తరలించారు. తల్లిదండ్రులు దుబాయ్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామానికి చేరుకోనున్నారు. వారు రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన దేవోళ్ల హన్మంతు ఈ నెల 26న బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే స్తోమత కుటుంబ సభ్యులకు లేకపోవడంతో స్థానిక నాయకులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. వారి చొరవతో మంగళవారం స్వగ్రామానికి హన్మంతు మృతదేహాన్ని తీసుకొచ్చారు. చివరి చూపుకోసం బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి
కంచర్ల గ్రామానికి చెందిన దండుగుల చిన్న లస్మయ్య(54) సైతం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఒకే రోజు వడ్డెరకాలనీలో ఇద్దరి అంత్యక్రియలు చేయడంతో కాలనీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి దొంగలు మల్లికార్జునస్వామి, ఎల్లమ్మ ఆలయాల తాళాలను పగలగొట్టి విగ్రహాలపై ఉన్న ఆభరణాలు, హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగలు పడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఆలయాలను పరిశీలించారు.
సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. స్థానిక యాదవనగర్ హెల్త్ సబ్‌సెంటర్‌ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల ఎదుగుదల కోసం పౌష్టికాహారం అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పరీక్షలు చేసి చికిత్స అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, సిబ్బంది ఉన్నారు.
దాడి ఘటనలో ఇద్దరిపై కేసు
తంగళ్లపల్లి: యువకుడిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన మంగళపల్లి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి వేగంగా ఎందుకు వెళ్తున్నావు అంటూ దాడికి దిగి కర్రతో కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ తండ్రి నాగరాజు ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్ రాజీవ్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రద్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కొట్నూరి రవి కూలీ పనుల నిమిత్తం ఎన్టీపీసీ ప్రాంతానికి వచ్చి ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్ నుంచి మేడిపల్లి రోడ్‌కు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన విక్టర్ తన బైక్‌తో రవిని ఢీకొన్నాడు. తలకు బలమైన గాయం కాగా చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

విషజ్వరంతో చిన్నారి మృతి