
ఆదరణ.. ఆలనా.. పాలనా
సిరిసిల్లఅర్బన్: బిడ్డ పుట్టగానే కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పిల్లలను ప్రయోజకుల్ని చేయాలని తపనపడుతుంటారు. తీరా పిల్లలు పెద్దయ్యాకా కన్నవారి ఆలనా పాలనా చూడకుండా ఎవరి దారి వారు చూసుకొని కన్నవారిని రోడ్డున పడేస్తారు. ఇలా నిరాదరణకు గురయ్యే వృద్ధుల కోసం సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో 2023లో ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయగా బాధితులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. ఇందులో చేరిన వృద్ధులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ వారి శేషజీవితం సంతోషంగా గడిపేందుకు తోడ్పడుతున్నారు. బుధవారం వృద్ధుల దినోత్సవం సందర్భంగా కథనం.
తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమాల్లో మొత్తం 44 మంది ఉంటున్నారు. వీటిలో 26 మంది వృద్ధురాళ్లు, 18 మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో కొందరు పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల వచ్చినవారు, మరికొందరు కోడళ్లు సరిగా చూసుకోనివారు, భర్త పోరు భరించలేక, భార్య పోరు భరించలేక ఈ ఆశ్రమాల్లో ఉంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. వృద్ధులు సంతోషంగా జీవించేందుకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వం 70 శాతం, ఎన్జీవోస్ 30 శాతం నిధులు కేటాయిస్తారు. దీంతో ఆశ్రమాల్లోని వృద్ధులను సినిమాలు, ఆలయాల సందర్శన, పర్యాటక స్థలాలకు తీసుకెళ్లి వారిలో ఉన్న బాధ, ఓత్తిడిని తగ్గించి, వారు సంతోషంగా ఉండేలా కృషి చేస్తారు. ఏది ఏమైనా కనిపెంచిన తల్లిదండ్రులను రోడ్డున పడేయడం సరికాదని, చంటి పిల్లలాంటి తల్లిదండ్రులకు సపర్యలు చేసి వారి రుణం తీర్చుకోవాలని పలువురు కోరుతున్నారు.
పండుటాకులకు అండగా వృద్ధాశ్రమాలు
నేడు వృద్ధుల దినోత్సవం