
ఒకే గొడుగు కిందకు ఉపకార వేతనాలు
కరీంనగర్: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరుస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. సంక్షేమశాఖల ద్వారా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇక నుంచి అన్నివర్గాల విద్యార్థులకు ఈపోర్టల్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్న నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(ఎన్‌ఎస్‌పీ)ను ఇందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉపకార వేతనాల కోసం ఇదే పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌పీ డిజిటల్ ప్లాట్‌ఫాంగా పనిచేస్తూ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. వారికి మంజూరైన ఉపకార వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఒకసారి విద్యార్థి తన వివరాలు నమోదు చేస్తే అన్ని రకాల స్కాలర్‌షిప్‌లకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, బ్యాంకు ఖాతా, ఆధార్, తదితర సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, కేటగిరీల వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని డిజిటల్ రూపంలోనే పరిశీలించి ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు.
దరఖాస్తు ఇలా
అధికారిక ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి పూర్తి వివరాల్లోకి వెళ్లాలి. కుల, ఆదా య ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వంటివి నమోదు చేస్తూ వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌పీలో కేంద్ర ప్రభుత్వం పలు రకాల ఉపకార వేత నాలు అందజేస్తోంది. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులకు ఈ పోర్టల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ స్కాలర్‌షిప్ లు, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ (ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ, సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 31 వరకు పోర్టల్ తెరిచి ఉంటుందని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు ధృవీకరించారు. ఒక విద్యార్థి ఒక్కసారి ఈపోర్టల్‌లో నమోదు చేస్తే శాశ్వతంగా నమోదై ఉంటుందని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్ తెలిపారు.
అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పోర్టల్ సౌకర్యం
అక్టోబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు