
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
కరీంనగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు అవుతుందని, దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు గెలుచుకునేందుకు ఇప్పటినుంచి అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, స్వామి తదితరులు పాల్గొన్నారు.