
వాన.. అన్నదాత హైరానా
సద్దుల సందడి
టవర్ సర్కిల్ ప్రాంతంలో..
నేటి సద్దుల పండుగకు మహిళలు సిద్ధమయ్యారు. బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన పూలతో కరీంనగర్‌లోని ప్రధాన మార్కెట్ ఆదివారం కళకళలాడింది. పూల కొనుగోళ్లతో డైలీ మార్కెట్, టవర్ సర్కిల్, కలెక్టర్ క్యాంపు ఆఫీస్, వాటర్ ట్యాంక్ ప్రాంతాలు సందడిగా మారాయి. పూలధరలు ఆకాశాన్ని అంటాయి. బంతి కిలో రూ.100 నుంచి 120 పలికింది. పట్టుగుచ్చు కట్టకు రూ.50, గునుగు రూ.10కి కట్ట చొప్పున విక్రయించారు. తంగేడు తక్కువ రాగా.. రూ.100కు విక్రయించారు. జనాల రద్దీతో మార్కెట్ ప్రాంతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. పోలీసులు ఆటోలు, ఇతర పెద్ద వాహనాలు లోనికి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వన్‌వే ఏర్పాటుచేయడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్, గంజ్, టవర్, పోస్టాఫీస్, మదీనా కాంప్లెక్స్ అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. – విద్యానగర్(కరీంనగర్)/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
కరీంనగర్ అర్బన్: వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో 28రోజులు గడువగా 13 రోజులు వర్షం పడటం.. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవడం సాగురంగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తెరిపినిచ్చిందుకున్న వాన మళ్లీ పంటదశలో విరుచుకుపడుతుండటంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది రైతుల పరిస్థితి. గత సీజన్‌లో అరకొర దిగుబడులతో ఇబ్బంది పడ్డ రైతులను ఈ సీజన్‌లో అతివృష్టి గుబులు రేపుతోంది. నల్లరేగడి నేలల్లోని వరి మినహా ఇతర పంటలు ఎర్రబడగా నేలలోకి దిగే పరిస్థితే లేదు. ఎర్రనేలలో పైరు ఎర్రబడటంతో పాటు ఎదుగుదల లేకపోవడం ఆన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో వర్షం కురవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
మెట్ట ప్రాంతాల్లోనే అధికం
ఒకప్పుడు మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు నేడు సాగునీటితో కళకళలాడుతున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించిన దాఖలాలుండగా ఈ మూడు మండలాలు సదరు జాబితాలో ఉండేవి. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు చెట్లను వృద్ధి చేయడంతో నేడా పరిస్థితి మారిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు చిగురుమామిడి, సైదాపూర్, మానకొండూర్ మండలాల్లో అదనానికి మించి వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో అదనపు వర్షపాతం నమోదవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పత్తి, వరి, ఆరుతడి పంటలకు నష్టం
తెల్లబంగారాన్ని పండించే రైతులకు ఈ సారి గడ్డురోజులేనని స్పష్టమవుతోంది. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటపై తెగుళ్లు దాడి చేయనుండగా పైరు ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. జిల్లాలో రెండే ప్రధాన పంటలు కాగా కొన్ని చోట్ల పత్తి తీత దశలో ఉండగా హెచ్చు ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. పత్తికి అత్యధిక ధర ఉండటంతో చాలామంది రైతులు పత్తికే మొగ్గుచూపారు. జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాకు మించి పత్తిని సాగు చేసినట్లు సమాచారం. ఈ నెల 24 సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండగా పత్తి మొక్కల ఎదుగుదలకు అవరోధంగా మారాయి. చెలక, నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరు తెగులు, పూత, కాత రాలిపోవడం వంటి తెగుళ్లు ఉధృతమయ్యాయి. సాగైన పంటలో 45శాతం వరకు తెగుళ్లు వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అరుతడి పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు ప్రతికూల పరిస్థితే. ఈ క్రమంలో తెగుళ్లు సోకుతుండగా నీటిలోనే పంట ఉండటంతో ఎర్రబడుతుండగా వీడని వాన నీడలా నష్టం చేస్తోంది. కందికి పచ్చపురుగు సోకగా మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ప్రధాన పంట వరి ఎర్రబారుతుండగా నియంత్రించేందుకు అదనపు శ్రమ, వ్యయం చేస్తున్నారు.
కూరగాయలపై ప్రభావం
రోజూ వర్షం కురుస్తుండటంతో కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా టమాట కుళ్లిపోతోంది. పంట ఎదుగుదల లేకపోగా టమాట రంగు మారుతోంది. తీగజాతి కూరగాయలు కాత నిలిచిపోగా ఎక్కువ నీటి నిల్వతో జీవం కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. ఇక పాడి గేదెల పెంపకందారులు వాటిని సంరక్షించేందుకు నానాపాట్లు పడుతున్నారు.
గత సెప్టెంబర్‌లో
కురిసిన వర్షం: 8 రోజులు
నమోదైన వర్షపాతం:
162.6 మిల్లిమీటర్లు
ఈ నెలలో(27 వరకు) కురిసిన వర్షం: 13 రోజులు
నమోదైన వర్షపాతం:
275.8 మి.మీలు
సాధారణం: 151.6 మి.మీలు
నెల కురిసిన వర్షం కురవాల్సింది వర్షపాతం
జూన్ 99.3 124.3 లోటు వర్షం
జూలై 272.7 237.7 సాధారణం
ఆగస్టు 283.5 203.6 అదనపు వర్షం
సెప్టెంబర్ 275.8 151.6 అదనానికి మించి

వాన.. అన్నదాత హైరానా

వాన.. అన్నదాత హైరానా

వాన.. అన్నదాత హైరానా

వాన.. అన్నదాత హైరానా