
బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు
కరీంనగర్ కార్పొరేషన్: సద్దుల బతుకమ్మకు నగరపాలకసంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. పండుగకు ఇప్పటికే రూ.కోటి 50 లక్షలతో 32 పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా, కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారులు డివిజన్లవారీగా పనులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ఎల్‌ఎండీ కట్ట, వేదభవన్, తీగలవంతెన, బొమ్మకల్, కిసాన్‌నగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట, దుర్శేడ్, గోపాల్‌పూర్, గౌతమినగర్ తదితర నిమజ్జన పాయింట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థలాలను చదును చేయడంతో పాటు, వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో, గుంతల్లో స్టోన్‌డస్ట్ పోస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద, బతుకమ్మ ఆడే ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే డస్ట్ పోస్తుండడం, రోడ్లు మాత్రం అలానే ఉండడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. దసరా రోజు రాంలీలా జరిగే మైదానాల్లో వేదికలతో పాటు , భారీగా లైట్లు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి లైట్లు తెప్పించారు. రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పరిశీలించారు.