
నవోదయలో దరఖాస్తులకు ఆహ్వానం
చొప్పదండి: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ, పదకొండవ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరుగతి చదువుతున్న వారు తొమ్మిదో తరగతిలో మిగులు సీట్లకు, పదో తరగతి చదువుతున్న వారు 11వ తరగతిలో మిగులు సీట్లకు అర్హులని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 23 లోగా ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎల్‌ఎండీలో వింత చేప
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వైరెటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇప్పటివరకు ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో ఇలాంటి చేప పడలేదని మత్స్యకారులు తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. వైరెటీ చేపను చుట్టుపక్కల గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
సైబర్ వల నుంచి తప్పించుకున్న మహిళ
హుజూరాబాద్: సైబర్ నేరగాళ్ల వల నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన సుస్రత్ అనే మహిళలకు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ‘మీ కూతురు తీవ్రమైన కేసులో ఇరుక్కుంది, ఆమె ప్రస్తుతం పోలీస్ కస్టడిలో ఉంది’ అని నమ్మించారు. కేసు పరిష్కారం కోసం తక్షణం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేసినా సుస్రత్ మానసికంగా కుంగిపోకుండా తన కూతురు క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే తన కూతురు చదువుతున్న కళాశాలకు వెళ్లగా, అక్కడ క్లాసులో క్షేమంగా, సంతోషంగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది. ఫోన్‌కాల్ మోసపూరితమని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తెలివితేటలతో వ్యవహరించిన మహిళను సీఐ కరుణాకర్ అభినందించారు.