
శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిపై పీడీయాక్ట్
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జగిత్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యానగర్‌కు చెందిన బండి అలియాస్ తరాల శ్రీకాంత్ తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో గతంలో రౌడీషీట్ ఓపెన్ చేసి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ, అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పీడియాక్ట్ నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిందితుడికి కరీంనగర్ జైల్లో అందజేయడంతో పాటు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందన్నారు. నిందితుడిపై గతంలో హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, బెదిరింపులకు పాల్పడిన 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీయాక్ట్ తో పాటు, అవసరమైతే నగర బహిష్కరణ కూడా అమలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. పీడీయాక్ట్ అమలుచేయడంలో కీలక పాత్ర పోషించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణసీఐ కరుణాకర్‌ను ఎస్పీ అభినందించారు.