
దాబా క్లోజ్!
గ‘లీజు దందా’ పార్ట్ –4
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్టీపర్పస్ పార్క్‌లోని దాబా ఎట్టకేలకు మూతపడింది. మూడ్రోజులుగా జరుగుతున్న నాటకీయపరిణామాల నడుమ నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. ‘గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో మల్టీపర్పస్‌పార్క్‌లో లీజు ఒప్పంద ఉల్లంఘనలపై ఎస్‌ఈ రాజ్‌కుమార్ నేతత్వంలోని కమిటీ విచారణ పూర్తి చేసి గురువారం కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి రిపోర్ట్ అందించారు. లీజు ఒప్పందాన్ని మీరి టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచడం, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం, వాకింగ్ ట్రాక్‌ను దుర్వినియోగం చేయడంతో పాటు అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడం లాంటి ఉల్లంఘనలు జరిగాయని కమిటీ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నివేదిక ఆధారంగా నిర్వాహకులకు బల్దియా నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోసారి లీజు ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే లీజు ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు నిర్వాహకులకు సంకేతాలు పంపించారు. లీజు ఒప్పందం మేరకు క్యాంటిన్‌ను నడిపించుకోవడానికి అంగీకరించిన అధికారులు, దాబా జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు.