
మహిళపై కత్తితో దాడికి యత్నం
● కేసు నమోదు చేసినా మారని తీరు
● భయాందోళనలో మహిళ కుటుంబ సభ్యులు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన కవిత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన రాజు అలియాస్ మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం కత్తి, బీరుసీసాతో దాడికి యత్నించాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా ఆమె డ్యాన్స్ చేస్తుండగా మల్లేశ్ అడ్డుకున్నాడు. దీంతో కవిత భర్త మల్లేశ్‌ను మందలించాడు. ఈ క్రమంలో కవితపై కక్షపెంచుకున్న మల్లేశ్ కత్తితో దాడికి యత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. మల్లేశ్ కత్తి, బీరుసీసాతో కాసేపు హంగామా సృష్టించాడు. ఎవరైనా అడ్డువచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైందని తెలుసుకున్న మల్లేశ్.. మంగళవారం సదరు మహిళ భర్తను చంపేస్తానంటూ మళ్లీ హంగామా సృష్టించాడు. కవిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.