
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
తిమ్మాపూర్: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సుభాష్‌నగర్ స్టేజీ వద్ద జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల సన్నీ(23) బుధవారం సాయంత్రం తిమ్మాపూర్ నుంచి గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా సుభాష్‌నగర్ స్టేజీ వద్ద యూ–టర్న్ తీసుకునే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సన్నీ తీవ్రంగా గాయపడగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సన్నీ మామ సదయ్య ఫిర్యాదుతో కారు డ్రైవర్ పల్లెర్ల రమేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు.
బొమ్మకల్ బైపాస్‌లో భార్య..
● భర్తకు స్వల్ప గాయాలు
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ బైపాస్‌లో బుధవారం ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్‌లో ఉంటున్న కుమారుడు, కుమార్తెను చూసేందుకు వచ్చి భార్య మృత్యువాత పడటంతో భర్త రోధించిన తీరు స్ధానికులను కంటతడి పెట్టించింది. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బెట మల్లయ్య–రాధ(47) దంపతులు కరీంనగర్‌లో ఉంటున్న కుమారుడు శివ, కుమార్తె మంగేశ్వరీని కలిసేందుకు ద్విచక్రవాహనంపై బొమ్మకల్ బైపాస్ రోడ్డులో వెళ్తున్నారు. ఎస్‌ఆర్ పెట్రోల్‌బంకు సమీపంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. కింద పడిన రాధ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్లయ్య రోడ్డు కింద పడటంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.