
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. సోమవారం ఉదయం త్రీటౌన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు రవాణా చేస్తే చర్యలు తప్పవని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 64 బైకులు, 5 ఆటోలు, ఒక ట్రాలీ ఆటో, ఒక కారు ఉన్నాయి. కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్– బెంగళూరు ప్రయాణికులకు రాయితీ
కరీంనగర్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో ప్రయాణించేవారికి బేసిక్ ఫేర్‌లో 25 శాతం రాయితీ ఉంటుందని రీజనల్ మేనేజర్ బి.రాజు ప్రకటనలో తెలిపారు. ఇదే రూట్‌లో సూపర్‌లగ్జరీ బస్సులో ప్రయాణించేవారికి ఆక్చువల్ చార్జీలో 20శాతం రాయితీ కల్పించబడునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
రేపు ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జాబ్ డ్రైవ్
కరీంనగర్‌క్రైం: నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. కళాశాలలోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు జాబ్ డ్రైవ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో వివిధ కంపెనీలు పాల్గొంటాయని మహిళా అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్లు, దరఖాస్తుతో హాజరుకావాలని సూచించారు.
4న మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర
కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆగస్టు 4న చొప్పదండి నియోజకవర్గానికి రానున్నారు. ఈ నెల 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆమె పాదయాత్ర చేపట్టం తెలిసిందే. ఇందులో భాగంగా 4న సాయంత్రం 5 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతారు. రాత్రి అక్కడే బసచేసి, 5న ఉదయం 11 గంటలకు శ్రమదానం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ వర్కర్స్‌తో సమావేశమవుతారు. అనంతరం వరంగల్ జిల్లాకు బయలుదేరుతారని పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన
కరీంనగర్ కార్పొరేషన్: ఈ–క్లాస్‌రూమ్స్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన జరుగుతుందని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఈ–క్లాస్‌రూమ్స్‌ను అభివృద్ధి చేసిన నగరంలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శంచారు. ఈ–క్లాస్‌రూమ్స్‌ను తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన వల్ల విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమవుతాయన్నారు. ఆన్‌లైన్ విద్యను సక్రమంగా అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈ లచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం