ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళల భాగస్వామ్యం
పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
నేటినుంచి వందరోజుల కార్యాచరణ
పెద్దపల్లిరూరల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, స్వశక్తి సంఘాల మహిళలను భాగస్వాములను చేస్తూ ప్రధాన సమస్యల పరిష్కారం, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వందరోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారు. ప్రతీనిత్యం శ్రీఒక చర్య.. ఒక మార్పుశ్రీ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కాలెండర్ రూపొందించింది.
పట్టణ రూపురేఖలను మార్చేలా చర్యలు చేపట్టేందుకు అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ప్రజలు తమవంతుగా పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇంటిఆవరణతోపాటు వీధులను శుభ్రంగా ఉంచేలా ప్రజల్లో చైతన్యం తెస్తారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ప్లాస్టిక్‌తో ముప్పుపై ప్రచారం
ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో కలిగే ముప్పుపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేసి ప్లాస్టిక్‌ను నియంత్రిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను డ్రైనేజీల్లో వేస్తే జరిమానా విధిస్తామనే సంకేతాలు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారీ చేయడంపై అవగాహన కల్పిస్తారు.
ఆదాయం పెంపే లక్ష్యంగా..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల ఆదాయం పెంచుకునే దిశగా అధికారులు ముందుకు సాగనున్నారు. పట్టణాల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారిలో ట్రేడ్‌లైసెన్స్‌లు లేనివారిని గుర్తించి జారీచేసేలా కార్యాచరణ చేపడతారు. ఇతర రకాల పన్నుల రూపేణా మున్సిపల్‌కు ఆదాయం సమకూరే విషయమై దృష్టి సారిస్తారు. భువన్ సర్వే నిర్వహించి అనుమతి లేనిఇండ్లను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా ప్రోత్సహిస్తారు.
కూడళ్ల అభివృద్ధి.. పార్కుల ఏర్పాటు
మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉన్న అ వాంతరాలు తొలగించేలా ఇతరశాఖల అధికారు లు, స్థానికుల సహకారంతో అభివృద్ధి చేస్తారు. కూ డళ్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చ ర్యల్లో అవసరమైన వారిని ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చే స్తారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్ పా ర్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తిస్తారు.
మహిళల ఆర్థికాభ్యున్నతికి..
స్వశక్తి సంఘాల్లో సభ్యులకు అవసరమైన రుణాలను ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటారు. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా లేనినిరుపేద మహిళలను గుర్తించి సంఘాలను ఏర్పాటు చేయిస్తారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆర్థికాభ్యున్నతి సాధించేలా సూచనలిస్తారు. అంతేకాకుండా పచ్చదనం.. పరిశుభ్రత అంశాలతోపాటు మరిన్ని అంశాలపై వందరోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారు.


