రాష్ట్రానికే ‘పెద్ద’పల్లి ఆదర్శం
కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో మొన్న పాఠశాలలకు ఎఫ్‌ఆర్‌ఎస్ నేడు అందుబాటులోకి ‘యూరియా బుకింగ్ యాప్’ రాష్ట్రమంతా అమలుకు పెద్దపల్లి నుంచే నాంది
పెద్దపల్లిరూరల్: యూరియా కృత్రిమ కొరత సృిష్టించే అవకాశం లేకుండా.. రైతు తన అవసరాలకు మించి ఎరువును వినియోగించకుండా.. ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని దుకాణం నుంచి సులువుగా తీసుకెళ్లేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ‘యూరియా బుకింగ్‌యాప్’ను అందుబాటులోకి తెచ్చారు. యాప్‌ను జిల్లాలో 15రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇంటి నుంచే సులువుగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్‌ను శనివారం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక ఇంటినుంచే బుకింగ్
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆలోచనల్లో నుంచి పుట్టిన యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా పట్టా పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తోంది. ఆ నంబరు నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు అనే వివరాలతో పాటు యూరియా ఎంతమేర అవసరమవుతుందనే సమాచారంతో బుకింగ్ ఐడీ వస్తుంది. వాటి ఆధారంగా సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఐదెకరాల భూమికలిగిన రైతులు రెండు విడతల్లో, 20 ఎకరాల లోపుగలవారు మూడు దఫాలుగా, అంతకన్న ఎక్కువ ఉంటే నాలుగు దశల్లో యూరియా తీసుకెళ్లేలా యాప్‌ను రూపొందించారు.
ఈ నెల 20 నుంచి పొరుగు జిల్లాలో..
పెద్దపలి జిల్లా నుంచి మొదలైన యూరియా బుకింగ్ యాప్ నమోదు ప్రక్రియ రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు పాకింది. ఈనెల 20న తొమ్మిది జిల్లాల్లో సాగింది. కొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్‌ను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పెద్దపల్లిలో ఈనెల 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శనివారం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ యూరియా బుకింగ్ ప్రక్రియ మొదలైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రానికి ఆదర్శం
జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అలగు వర్షిణి పాలనలో అమల్లోకి తెచ్చిన ‘సాండ్‌టాక్సీ పాలసీ’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని విద్య, వైద్యశాఖల్లో అమలు చేసేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. తా జాగా ఎరువుల కృత్రిమ కొరత రాకుండా యూరి యా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఇబ్బంది పడొద్దనే
యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరి యా బుకింగ్ యాప్ రూ పొందించాం. ఇంటినుంచే సులువుగా బుకింగ్ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లి


