పల్లె పాలన
నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం నిధులు లేవు.. పనులెట్లా? నిధులు లేక అభివృద్ధి అస్తవ్యస్తం సవాల్‌గా మారనున్న నిర్వహణ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు రెండేళ్ల తర్వాత కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు
ఆ నిధులు వస్తే పండుగే
ఖాళీ ఖజానా..
కరీంనగర్/కరీంనగర్ టౌన్: గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పాలన తిరిగి ప్రారంభమవుతున్న వేళ.. సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సమస్యలు స్వా గతం పలుకుతున్నాయి. రెండేళ్లు ప్రత్యేకాధికారుల చేతిలో కొనసాగిన గ్రామాల్లో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. నిధులు లేక పల్లెలు కుదేలయ్యాయి. ఇప్పుడు బాధ్యతలు చేపట్టనున్న పాలకవర్గాలకు ఖాళీ ఖజానా, పెరిగిన నిర్వహణ భారమే మిగిలింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికం భారంగా మారబోతున్నాయి.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని 316 పంచాయతీలు, 2,946 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న మొదటి విడతలో 92 పంచాయతీలు, 866 వార్డులకు.. 14న రెండో విడతలో 113 పంచాయతీలు, 1046 వార్డులకు, మూడో విడతలో 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 17న ఎన్నికలు నిర్వహించింది. సర్పంచులు సహా వార్డు సభ్యు ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న(నేడు) ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. అదే రోజు నుంచి పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
పెండింగ్‌లో నిధులు
పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్‌లకు 2024– 2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా... పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. జీపీలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను జీపీలుగా మార్చింది. ప్రతీ జీపీలో కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికులను నియమించాల్సి ఉంది. చాలా గ్రామాల్లో సరిపడా ఉద్యోగులు లేక ఉన్నవారితో సర్దుబాటు చేయాల్సి వస్తోంది.
15వ ఆర్థిక సంఘం నిధులపైన కొత్త సర్పంచ్‌లు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రతి గ్రామానికి జనాభా ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.900 నుంచి రూ.1,400 చొప్పన నిధులు రానున్నాయి. 3వేల జనాభా ఉంటే రూ.27లక్షల నిధులొస్తాయి. రెండేళ్లకు రూ.54లక్షలు రానున్నాయి. వచ్చే మార్చి ఆఖరి నాటికి ఆర్థికసంఘం గడువు ముగిసిపోనుంది. రెండేళ్లు నిధులొస్తే కొత్త సర్పంచ్‌లకు ఊరట కలగనుంది. 15వ ఆర్థిక సంఘంతో పాటు ఎస్‌ఎఫ్‌సీ నిధులు వస్తేనే పల్లెల అభివృద్ధి పట్టాలెక్కనుంది.
జిల్లాలోని గంగాధర మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి వైకుంఠధామం నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఇక్కడ పారుతున్న ఓ ఒర్రైపె కల్వర్టు నిర్మాణం చేపడితే వైకుంఠధామం ఉపయోగంలోకి వస్తుంది. నూతన పాలకవర్గం సమస్యను పరిష్కరించి, చివరి మజిలీలో ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పాలకవర్గాలదే బాధ్యత
ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసం వెచ్చించే బాధ్యత సర్పంచ్‌లదే. ఐదేళ్లపాటు ప్రభుత్వాలకు, అధికారులకు అనుసంధానం ఉంటూ గ్రామాల్లో జవాబుదారి పాలన అందించాలి. ప్రజల శ్రేయస్సే, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పాలకవర్గాలకు అభినందనలు. – జగదీశ్వర్, డీపీవో
ఆనందంగా ఉంది
సర్పంచ్‌గా గెలవడం ఆనందంగా ఉంది. నేటినుంచి పద వీ బాధ్యతలు చేపట్టడం మరి చిపోలేని అనుభూతి. గ్రామంలోని సమస్యలను అన్ని వర్గాలతో చేర్చించి పరిష్కరించేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామంలోని అన్ని రకాల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి.. రేణికుంట అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా.
– ఎలుక ఆంజనేయులు, రేణికుంట సర్పంచ్
పల్లె పాలన
పల్లె పాలన
పల్లె పాలన


