ప్రజల మనసులోంచి గాంధీని ఎలా తొలగిస్తారు
కరీంనగర్ కార్పొరేషన్: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తారేమో కాని, ప్రజల గుండెల్లో ఉన్న గాంధీని ఎలా తొలగిస్తారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని కిసాన్‌నగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉపాధి హామీ పథకానికి గాంధీపేరుకొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చిన గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. పేదల ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి పెట్టిన గాంధీ పేరు ను తొలగించడం సిగ్గుచేటన్నారు. కొత్త సర్పంచ్‌లు తమ గ్రామపంచాయతీల మొదటి సమావేశంలో ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తొలి తీర్మాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంబేడ్కర్, నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నారన్నా రు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆకా రపు భాస్కర్‌రెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, చాడగొండ బుచ్చిరెడ్డి, మెండి చంద్రశేఖర్ పాల్గొన్నారు.


