బోగస్ ఏరివేతకు ఈ– కేవైసీ
కరీంనగర్ అర్బన్: బోగస్ కార్డులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ– కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. రేషన్ కార్డు యజమానితో పాటు కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతి నెల 1 నుంచి 15– 17వ తేదీ వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3,17,748 రేషన్‌కార్డులుండగా 9,45,665 మంది సభ్యులుండగా ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. 7,20,517 యూని ట్లు మాత్రమే ఈకేవైసీ కాగా మరో 2లక్షల మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. రేషన్ దుకాణాల్లో సదరు ప్రక్రియ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాలు మూసివేసి ఉండటం గమనార్హం.
మరో 9రోజులే గడువు
ఈ నెలాఖరులోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. పౌరసరఫరాల అధికారులు మాత్రం నిర్ణీత గడువంటూ లేదని కా నీ ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. వా స్తవానికి డిసెంబర్ 31లోపు కేవైసీ చేసుకోకుంటే కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధృవీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా రేషన్ దుకాణాలు మాత్రం మూసివేసి ఉండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగుంటే ఎలా ఈకేవైసీ చేసుకోవాలని వాపోతున్నారు.
కొత్త సభ్యులు కూడా చేసుకోవాల్సిందే
జిల్లాలో కొత్తగా 42వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 1.01లక్షల మంది సభ్యులుండగా వీరంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. పాత కార్డుల్లో పేరు తొలగించుకొని వీటిల్లో చేరిన వారు సైతం ఈ ప్రక్రియ పూర్తిచేయించుకోవాల్సిందే. ఇందుకు లబ్ధిదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. రేషన్ డీలర్ పూర్తి ఉచితంగా సేవలందించాల్సిందే. ఎంత మంది వచ్చినా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 3,17,748
కార్డుల్లో మొత్తం సభ్యులు: 9,45,665
రేషన్ దుకాణాలు: 566
మొత్తం గ్రామాలు: 316
మున్సిపాలిటీలు: 4
ఈకేవైసీ చేసుకున్న సభ్యులు: 7,20,517
ఈకేవైసీ చేసుకోవాల్సిందే
ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి.
– నర్సింగరావు,
జిల్లా పౌరసరఫరాల అధికారి


