ఇల్లు కడితే రూ.లక్ష
ఒక్కో అంతస్తుకు రూ.లక్ష అదనం నగరంలో మాజీ కార్పొరేటర్ల వసూళ్లు టౌన్ ‘ప్లానింగ్’తో యథేచ్ఛగా దందా పదవిలో లేకపోయినా బెదిరింపులు బెంబేలెత్తుతున్న నిర్మాణదారులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా కొంతమంది మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందా ఆగడం లేదు. పదవిలో ఉన్నప్పుడు చేసిన వసూళ్లకు కొనసాగింపుగా జోరు తగ్గడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ‘సీ ట్యాక్స్’ (నిర్మాణదారులు పెట్టుకున్న పేరు ‘కార్పొరేటర్ ట్యాక్స్’) వసూళ్లలో ఆరితేరినవారు మాజీలైనా చేతివాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంటికో రూ.లక్ష
నగరంలో గృహ నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి, ఇతరత్రా వర్గాలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే అ దనుగా కొందరు మాజీ కార్పొరేటర్లు వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఎవరు ఇంటి నిర్మాణం చేపట్టినా, అక్కడికి అనుచరులను పంపించి తమను అనివార్యంగా కలిసేలా చేస్తున్నారు. త మకు డబ్బులు ముట్టచెబితే నిర్మాణానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూస్తామని హామీ ఇస్తున్నా రు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, ఒక్కో అంతస్తుకు రూ.లక్ష అదనం. ఎన్ని అంతస్తులు వేస్తే అన్ని రూ. లక్షలుగా ఫిక్స్ చేశారు. అపార్ట్‌మెంట్లకు ప్రత్యేక రేటు.
టౌన్ ‘ప్లానింగ్’తోనే
వసూళ్ల దందాలో మాజీ కార్పొరేటర్లు సూత్రధారులైతే, నగరపాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు పాత్రధారులు. తాము చెప్పినట్లు డబ్బులు ఇవ్వని నిర్మాణదారులను టౌన్‌ప్లానింగ్ విభాగంతో వేధింపులకు గురిచేయడం మాజీ కార్పొరేటర్ల ప్రత్యేకత. నిర్మాణం జరుగుతున్న ఇంటి పక్కల వారితో లేనిపోని ఫిర్యాదులు చేయించడం, టౌన్‌ప్లానింగ్‌తో నోటీసులు ఇప్పించడం, మామూళ్లు ఇచ్చేలా ఒప్పించుకోవడం మాజీ కార్పొరేటర్ల స్టైల్. తమకు సహకారం అందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి పర్సంటేజీలు ఇస్తుండడం బల్దియాలో బహిరంగ రహస్యమే. మొన్నటి వరకు విధులు నిర్వర్తించిన కొంతమంది చైన్‌మెన్‌న్లు ఇందులో ఆరితేరిన వాళ్లే. ఇలాంటి ఆరోపణలతో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఇటీవల గంపగుత్తగా చైన్‌మెన్లను బదిలీ చేయడం తెలిసిందే.
బాధితుల బెంబేలు
మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాతో భవన నిర్మాణదారులు బేజారెత్తిపోతున్నారు. బ్యాంక్‌లోన్లు, అప్పులు, కూడబెట్టుకొన్న సొమ్ము, ఇతర ఆస్తులు అమ్మి ఇల్లు కట్టుకుంటున్న తమను బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేయడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ కార్పొరేటర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలో అర్థం కావడం లేదని, టౌన్‌ప్లానింగ్ విభాగం జోక్యంతో ఎందుకొచ్చిన సమస్యలని ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఓ భవన నిర్మాణదారుడు ‘సాక్షి’తో వాపోయాడు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ కార్పొరేటర్‌తో బాధితులంతా ఇటీవల నగరపాలకలసంస్థకు వచ్చారు. నగరానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సహకారంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాజీ కార్పొరేటర్ల దందాకు సహకరిస్తూ, అధికారులు నోటీసులు ఎలా ఇస్తారంటూ నిలదీయడంతో ఈ వసూళ్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికై నా మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాకు టౌన్‌ప్లానింగ్ సహకరించకుండా, భవన నిర్మాణాల్లో పారదర్శకంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
‘నగరంలోని ఓ శివారు డివిజన్ వివాదాలకు చిరునామా. ఆ ప్రాంతంలోనూ భవన నిర్మాణాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఓ ఇంటి నిర్మాణదారుడిని డివిజన్ మాజీ కార్పొరేటర్ సంబంధీకులు సంప్రదించారు. ఇంటి నిర్మాణం జరుగుతున్నందున మాజీ కార్పొరేటర్‌ను కలవాలంటూ హుకూం జారీ చేశారు. తనకున్న పలుకుబడితో యజమాని ఇంటి నిర్మాణాన్ని కొనసాగించారు. చుట్టు పక్కలవారితో తరచూ ఏదో ఒక ఫిర్యాదు ఇప్పిస్తూ, సదరు యజమానిపై వ్యూహాత్మకంగా మానసిక ఒత్తిడి పెంచారు. తట్టుకోలేక ఆ మాజీ కార్పొరేటర్‌కు రూ.50వేలు ఇవ్వడంతో నిర్మాణం సాఫీగా సాగుతోంది.’
‘కలెక్టరేట్‌కు కూతవేటులో ఉన్న ప్రాంతంలో ఇంటి నిర్మాణాలు రెగ్యులర్‌గా కొనసాగుతాయి. ఇదే అదనుగా మాజీ కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు తెరలేపారు. ‘సీ’ ట్యాక్స్‌లో ఆరితేరిన సదరు మాజీ కార్పొరేటర్ నిర్మాణదారులకు ‘ఫిక్స్‌డ్ రేట్’ పెట్టారు. ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, అంతస్తు పెరిగితే అదనంగా రూ.లక్ష ఇవ్వాలని రూల్ పెట్టారు. పదవి పోయి రెండేళ్లవుతున్నా వసూళ్లు ఆగడం లేదు. డబ్బులు ఇవ్వనివారిని టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి ఏదో ఒక వంకతో నోటీసులు ఇప్పిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంత బాధితులంతా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.’
ఇల్లు కడితే రూ.లక్ష


