
● కరీంనగర్–వరంగల్ సెక్షన్‌లో జరుగుతున్న పనులు ● అంచనా వ్యయం రూ.2,146 కోట్లకు చేరినట్లు సమాచారం ● 68 కి.మీ.లో 4.17 కి.మీ. మేర పూర్తయిన రహదారి ● వచ్చే ఏడాది జూలై లక్ష్యంగా ముందుకెళ్తున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఖమ్మం నుంచి జగిత్యాల మధ్య నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి–563 పనులు మొదలయ్యాయి. వరంగల్ దాటిన తర్వాత కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులకు చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు 68 కి.మీ. దూరం ఉన్న ఈ సెక్షన్‌ను నాలుగు వరుసల రహదారిగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4.17 కి.మీ. మేర రహదారి పూర్తయింది. ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో దాదాపుగా భూసేకరణ పూర్తయింది. ఈ జాతీయ రహదారి కోసం కోసం కరీంనగర్ జిల్లాలో మొత్తం 258.67 హెక్టార్ల భూమి అవసరం. కొంతకాలంగా జిల్లాలోని కేశవపట్నం, మానకొండూర్, కొత్తపల్లి మండలాల్లో పలువురు రైతులు, నిర్వాసితులు తమ భూమి పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్న విషయం విదితమే. మరోవైపు జాతీయ రహదారి పనులు చకచకా సాగుతున్నాయి.
2025 జూలై లక్ష్యం..
ఎన్‌హెచ్–563 జాతీయ రహదారి మొత్తం 248.83 కి.మీ. దూరం. దీన్ని కరీంనగర్–వరంగల్, కరీంనగర్–జగిత్యాల సెక్షన్లుగా విభజించి, భూసేకరణ చేపట్టారు. దీనికి జగిత్యాల, వరంగల్, మరిపెడ, ఖమ్మం సమీపంలో జంక్షన్లు నిర్మించనున్నారు. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌లో భూసేకరణ ప్రక్రియను 3ఏ, 3జీ, 3డీలుగా విభజించారు. ఈ మూడు విభాగాలు మొత్తం నోటిఫై అయ్యాయి. దాదాపు ఈ ప్రాంతంలో భూసేకరణ పూర్తయినట్లు సమాచారం. అందుకే, అధికారులు రోడ్డు పనులు ముమ్మరం చేశారు. వాస్తవానికి 2025 జూలై నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇరుకుల్ల వద్ద వంతెన పనులు
ప్రస్తుతం ఎన్‌హెచ్–563 జగిత్యాల–కరీంనగర్ సెక్షన్‌లో కరీంనగర్ బస్టాండ్ నుంచి కోర్టు చౌరస్తా, రేకుర్తి కొత్తపల్లి మీదుగా వెళ్లేదారిలో ఇటీవల కొన్ని మార్పులు జరిగాయి. కరీంనగర్‌లో మానకొండూర్ మీదుగా ఇరుకుల్ల వాగు జూబ్లీనగర్, ఎలబోతారం,రుక్మాపూర్‌ల మీదుగా కొత్తపల్లిలో కలవనుంది. ఈ రహదారి వెంట 11 వంతెనల నిర్మాణం జరగనుంది. మొత్తం 68 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి నిర్మాణానికి గతేడాది రూ.1,641 కోట్లతో అంచనాలు ఖరారయ్యాయి. అయితే, ఆ తర్వాత పలు రంగాల్లో వచ్చిన మార్పులు, రేట్లు పెరిగిన దరిమిలా.. అంచనా వ్యయం తాజాగా రూ.2,146 కోట్లకు చేరుకుందని సమాచారం. అంటే దాదాపు రూ.505 కోట్లు పెరిగింది. గతంలో ఈ అంచనా వ్యయం రూ.655 కోట్లు అని ప్రచారం జరిగింది. అదే సమయంలో జగిత్యాల–కరీంనగర్ సెక్షన్‌లో జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు 58 కిలోమీటర్ల రహదారికి రూ.1,503.866 కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సంబంధిత వివరాలు వెలువడిన సంగతి తెలిసిందే.
కొత్తగట్టు వద్ద టోల్‌గేట్..
ఎన్‌హెచ్–563లో భాగంగా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు వద్ద టోల్‌గేట్ నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గంలో వెళ్లే ప్రతీ వాహనం ఇక్కడ టోల్ చెల్లించి, వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పనులను డీబీఎల్ కంపెనీ చేపడుతున్నట్లు సమాచారం. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌లో పనులు పూర్తయితే, చత్తీస్‌ఘడ్–తెలంగాణ–మహారాష్ట్రల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. రవాణాతోపాటు పర్యాటకం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమకు పరిహారం విషయంలో నెలకొన్న అసమానతలను తొలగించాలని కరీంనగర్, జగిత్యాల జిల్లాలవాసులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
డెవలప్‌మెంట్ వాచ్

ఇరుకుల్ల వద్ద వంతెన పనులు

ఎన్‌హెచ్–563 రూట్ మ్యాప్