
గుండెపోటుతో ముగ్గురు మృతి
● మృతుల నేత్రాలు దానం
● ఆరుగురు అంధులకు చూపు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో సోమవారం రాత్రి ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాదంలో కూడా ఆ మూడు కుటుంబాలు.. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ముగ్గురి నేత్రాలను దానం చేశారు. ఆరుగురు అంధులకు కంటి వెలుగులు ప్రసాదించేలా సహకరించారు. ఈ ముగ్గురిలో సమీప బంధువు తాండూరి శ్రీనివాస్ పార్థివదేహాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సందర్శించి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ముగ్గురి చూపు.. ఆరుగురికి కంటి వెలుగులు..
జవహర్‌నగర్‌కు చెందిన తాండూరి శ్రీనివాస్(49) సింగరేణిలోని ఎస్‌ఎంఎస్ ప్లాంట్‌లో స్టేనోగా పనిచేస్తున్నాడు. ఛాతీలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీనివాస్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా నివాళి అర్పించారు. అదేవిధంగా దుర్గానగర్‌కు చెందిన సీనియర్ వ్యాపారి అమృత్‌లాల్ చౌడ(78) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన 55 ఏళ్లుగా హార్డ్‌వేర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మృతుడి నేత్రాలను కుమారుడు, కోడలు జయప్రకాశ్ చౌడ–కవిత, మనమలు కౌశల్, నివేద్ దానం చేశారు. మరోవైపు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల సాయిలు(70) సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్, స్ఫూర్తి క్లబ్ ప్రతినిధులు అభినందించారు.

గుండెపోటుతో ముగ్గురు మృతి

గుండెపోటుతో ముగ్గురు మృతి

గుండెపోటుతో ముగ్గురు మృతి