
వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..
సిరిసిల్లకల్చరల్: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. అని పెద్దలు చెప్పిన మాటలను నమ్మి ముందుకెళ్లి విజయం సాధించాడు భైరి మధు. తన తప్పేమి లేకున్నా చేస్తున్న వ్యాపారంలో నష్టం రాగా.. అదే రంగంలో వినూత్నంగా ఆలోచించి ఉపాధి పక్కాగా చేసుకున్నాడు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన మధు తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం భీవండిలో స్థిరపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి సిరిసిల్ల సమీపంలోని చంద్రంపేటకు వచ్చాడు. తన రెక్కల కష్టంతో రెండు కార్ఖానాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయాడు. పడిన చోటే తిరిగి లేవాలని భావించి.. చేనేత రంగంలోని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
కరోనాతో కొత్త జీవితం
కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో మాస్కుల తయారీపై దృష్టి సారించిన మధు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు సరఫరా చేశాడు. సంక్షోభం ముగిసి సమాజం సాధారణ స్థితికి చేరేసరికి మధుకు ప్రత్యామ్నాయ వ్యాపారం జాడ దొరికింది. జాతీయ జెండాల రూపకల్పన, బ్యానర్లతోపాటు పండుగల సందర్భంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కండువాలు తయారు చేయడం ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా వస్త్రం కొనుగోలు చేయడం, రంగులు అద్దించడంతోపాటు వాటిని ఆర్డర్ల మేరకు కండువాలు, తయారు చేయిస్తున్నాడు. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి సామూహిక ఉత్సవాల్లో ఉపయోగించే లాల్చీలు, కుర్తాలు కుట్టించి విక్రయిస్తున్నాడు. వివాహాది శుభకార్యాల సందర్భంగా ఆయా కార్యక్రమాల నిర్వాహకులు ఏకరీతిగా ఉండే కుర్తాలు ధరిస్తుంటారు. అదే అదనుగా హల్దీ, సంగీత్ వంటి ఉత్సవాలకు అవసరమైన కుర్తాలు తయారు చేయించి అమ్ముతున్నాడు.
మరో 40 మందికి ఉపాధి
మధు తాను ఉపాధి పొందడంతోపాటు మరో 40 మందికి కుర్తాలు కుట్టే పనిలో ఉపాధి ఇస్తున్నాడు. ఒక్కొక్కరు వారి పని తీరు ఆధారంగా రోజుకు కనీసం రూ.300 సంపాదిస్తున్నారు. మధు చేస్తున్న పనికి ఆయన సతీమణి శ్యామల సైతం తోడుగా నిలుస్తోంది.
కుర్తాలు, లాల్చీల తయారీ
మరో నలభై మందికి ఉపాధి
స్వయంకృషితో రాణిస్తున్న మధు
కరోనా నేర్పిన దారి
కోవిడ్ మహమ్మారి కారణంగా చేస్తున్న వ్యాపారం నష్టపోయాను. మాస్కులు ధరించడం తప్పనిసరి అనే ప్రచారంతో మాస్కులు త యారు చేయించి ఊరూరూ తిరిగి అమ్మేవాన్ని. టీవీఎస్ ఎక్సెల్ బండిమీద పలు జిల్లాల్లో మాస్కులు విక్రయించాను. మెల్లగా కరోనా పీరియడ్ తరువాత ఈ కుర్తాలు, జెండాలు, కండువాలు తయారు చేయించి విక్రయిస్తున్నాను. – భైరి మధు, తయారీదారుడు
కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా
కొంతకాలంగా కుర్తాలు, లాల్చీలు కుట్టడం కోసం ఇక్కడే పనిచేస్తున్నాను. రోజుకు 30 నుంచి 40 వరకు లాల్చీలు కుట్టగలుగుతున్నాను. రోజుకో రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు వరకు ఆదాయం వస్తోంది. – సిరిపురం లక్షణ

వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..

వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..

వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..