
పల్లెకు సౌరవెలుగులు
● సోలార్ పవర్ ఉత్పత్తిపై గ్రామీణుల ఆసక్తి
● విద్యుత్ చార్జీల ఆదా.. అదనపు ఆదాయం
● పీఎం సూర్యఘర్ స్కీంకు పెరుగుతున్న డిమాండ్
మంథనిరూరల్: ఆధునిక సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెదుతోంది. దీనిని సొంతం చేసుకోవడంలో పల్లెవాసులూ ఆసక్తిచూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ పవర్ తయారీ, వినియోగం పద్ధతులు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విద్యుత్ చార్జీల భారం తగ్గించుకునేందుకు పల్లెప్రజలు సోలార్ పవర్‌పై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటున్నారు.
ఇంటికి 300 యూనిట్లు ఉచితం..
పీఎం సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన ద్వారా సోలార్ సిస్టం అమర్చుకుంటే ఇంటికి 300 యూనిట్లు ఉచితంగా అందించేలా రూపకల్పన చేశారు. దీంతో విద్యుత్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
చార్జీల ఆదా.. అదనపు ఆదాయం..
సోలార్ పవర్ తయారీ సిస్టమ్ అమర్చుకుంటే ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయి. ఈ ప్యానెల్స్ ద్వారా నెలకు 300 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 200 – 300 యూనిట్ల వరకు గృహావసరాలకు వినియోగించుకోవాలి. మిగిలిన విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్ ఒక్కో యూనిట్‌కు రూ.4 చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఒకవైపు విద్యుత్ చార్జీల భారం తగ్గడం, మరోవైపు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుండడంతో పల్లెవాసులు తమ ఇళ్లపై సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
కేంద్రప్రభుత్వం నుంచి రాయితీ..
కేంద్రప్రభుత్వం గతేడాది ప్రవేశ పెట్టిన సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రాయితీ వర్తింపజేస్తోంది. 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ సిస్టం అమర్చుకుంటే రూ.78 వేలు, 2 కిలోవాట్లు అయితే రూ.60 వేలు, ఒక కిలోవాట్ అయితే రూ.30 వేల వరకు సబ్సిడీ అందిస్తోంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, నెలసరి విద్యుత్ బిల్లు, ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రం ఉంటే చాలు. దరఖాస్తు ఆమోదం తర్వాత ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చుతారు.
కరెంట్ చార్జి తగ్గుతుంది
రోజురోజుకూ కరెంట్ చార్జీలు పెరుగుతున్నయ్. ఎండకాలంలో రూ.వేలకు వేలు కట్టాల్సి వస్తోంది. కరెంటు చార్జీల భారం తగ్గుతుందనే ఆలోచనతో సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకున్న. ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది.
– ముత్యాల లింగయ్య, ధర్మారం, మంథని
అదనపు ఆదాయం
గృహావరాలకు ఉచితం. అదనపు ఆదాయం వస్తుందనే ఆలోచనతో సోలార్ సిస్టం తీసుకున్న. సబ్సిడీ కూడా వస్తుంది. ఇంట్లో మేం వాడుకోగా మిగలిన సోలార్ కరెంట్‌ను అధికారులు తీసుకుని మాకు పైసలు ఇస్తున్నరు.
– బడికెల సతీశ్, ఉప్పట్ల, మంథని

పల్లెకు సౌరవెలుగులు

పల్లెకు సౌరవెలుగులు

పల్లెకు సౌరవెలుగులు