
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ..
● ఐలాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం
● చెట్టును ఢీకొట్టిన కారు
● ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
కోరుట్లరూరల్: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని అయిలాపూర్ శివారులో మంగళవారం ఉదయం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. అయిలాపూర్‌కు చెందిన గాడిపెల్లి నరేశ్ (36) కొంతకాలంగా గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు. 20రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో పండగలన్నీ చేసుకున్నారు. ఈనెల 10న తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సోమవారం ఉదయం తోడళ్లుడు బొల్లపెల్లి శ్రీనివాస్ కారులో రెండు కుటుంబాలు కలిసి యాదగిరి, స్వర్ణగిరి ఆలయాలను దర్శించుకున్నారు. రాత్రిసమయంలో తిరుగు పయణమయ్యారు. రెండు నిమిషాలైతే ఇంటికి చేరేదే.. ఆలోపే అయిలాపూర్ శివారు సబ్‌స్టేషన్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బొల్లెపల్లి శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాస్ భార్య సుజాతకు రెండు కాళ్లు, ఓ చేయి విరిగింది. నరేశ్ భార్య సరితకు రెండు చేతులు విరిగాయి. నరేశ్ కుమారుడు, కూతురు, శ్రీనివాస్ కూతురును జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నరేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు.

దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ..