
సీపీఐ శ్రేణుల ర్యాలీ (ఫైల్)
కరీంనగర్: నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన చరిత్ర సీపీఐది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఆ పార్టీని ఎంతగానో ఆదరించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి పలుమార్లు ఎర్రజెండాను చట్టసభలకు పంపారు. ఆ నేతలు కూడా ప్రజల పక్షాన తమ గొంతు వినిపించారు. ఉమ్మడి జిల్లా మొదటి నుంచి కమ్యూనిస్టులకు ఆయువుపట్టుగా నిలిచింది. నిజాం నవాబు రాచరిక పాలన అంతం కోసం పోరాడి, తొలి ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన అనభేరి ప్రభాకర్‌రావు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డిలతోపాటు ఎందరో అగ్రగణ్యులను అందించిన కరీంనగర్ వామపక్ష పోరాటాలకు పుట్టినిల్లయింది. అనభేరి ప్రభాకర్‌రావు సీపీఐ జిల్లా తొలి కార్యదర్శి కావడం గమనార్హం. అమృతలాల్ శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, దేశిని చిన్నమల్లయ్యలు జిల్లా కార్యదర్శులుగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సారథ్యం వహించి, ప్రస్తుతం జాతీయ నాయకుడిగా ఉన్న చాడ వెంకట్‌రెడ్డి సైతం జిల్లాకు చెందినవారే. అలాగే, 1952లో కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును ఓడించిన బద్దం ఎల్లారెడ్డి సీపీఐ నాయకుడే.
ఏడు నియోజకవర్గాల్లో గెలుపు..
తొలినాళ్లలో కరీంనగర్‌తోపాటు అప్పటి నుస్తులాపూర్, ఇందుర్తి, బుగ్గారం, చొప్పదండి, మేడారం, నేరెళ్ల అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ, పీడీఎఫ్ అభ్యర్థులుగా చీటి వెంకటరామారావు, బద్దం ఎల్లారెడ్డి, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, బి.మల్లారెడ్డి, అమృతలాల్‌శుక్లా, దేశిని చిన్నమల్లయ్యలు విజయం సాధించారు. అలాగే, ఉమ్మడి శాసనసభలో చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చాడ వెంకట్‌రెడ్డిలు సీపీఐ శాసనసభాపక్ష నేతలుగా వ్యవహరించారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగగా, ఇందుర్తిలో 8 సార్లు, సిరిసిల్లలో 6 సార్లు సీపీఐ అభ్యర్థులు గెలవడం గమనార్హం. అలాగే, 1952 నుంచి రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులు అసెంబ్లీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ విజయం సాధిస్తూ గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండేవారు.
2009 నుంచి ఒక్క ఎమ్మెల్యే లేరు
జిల్లాలో ఘన చరిత్ర గల సీపీఐ మారుతున్న సమీకరణాలను ఆకలింపు చేసుకోలేక ప్రజలకు దూరమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 2009 నుంచి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేకపోవడం ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో చెబుతోంది. సిరిసిల్ల, ఇందుర్తి ఏరియాల్లో ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతో ఇంతో పట్టు సాధిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో యువతను పార్టీలోకి ఆకర్షించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు 1994 నుంచి జరుగుతున్న అంతర్గత పోరు పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్ ఉంది. ఈసారి ఎన్నికల్లో సీట్ల ఒప్పందంలో భాగంగా దాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంతో కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు. 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన చాడ వెంకట్‌రెడ్డికి 48 వేల ఓట్లు వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ఎన్నికల్లో తలపడే అర్థబలం, అంగబలం లేక ఉనికి కోల్పోయామ ని కామ్రేడ్స్ అంగీకరిస్తున్నారు. దీంతో గతమెంతో ఘనమని చెప్పుకుంటూ తృప్తి చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కమ్యూనిస్టులకు ఉమ్మడి జిల్లా ఆయువుపట్టు
‘అనభేరి, బద్దం’ వంటి మహామహుల పురిటి గడ్డ
1952 నుంచి పలువురు చట్టసభలకు..
సాయుధ పోరాటం, ప్రజల పక్షాన గొంతు వినిపించిన చరిత్ర
నేడు అర్థబలం, అంగబలం లేక చతికిల పడిన వైనం
తొలిసారి ఇక్కడి నుంచి పోటీకి దూరం

రాజేశ్వర్‌రావు (ఫైల్)

అనభేరి (ఫైల్)

చిన్నమల్లయ్య (ఫైల్)

వెంకట్‌రెడ్డి

ఎల్లారెడ్డి (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment