Telangana Crime News: ఫ్యాన్‌కు ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త! వరలక్ష్మి మృతిపై కొత్త కోణం..
Sakshi News home page

ఫ్యాన్‌కు ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త! వరలక్ష్మి మృతిపై కొత్త కోణం..

Sep 9 2023 1:26 AM | Updated on Sep 9 2023 11:51 AM

- - Sakshi

కరీంనగర్‌: కరీంనగర్‌లోని సాయిబాలాజీనగర్‌లో ఉంటున్న వరలక్ష్మి(33)ని ఆమె భర్తే చంపినట్లు త్రీటౌన్‌ పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం మండలంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మికి, సుల్తానాబాద్‌ మండలంలోని గట్టెపల్లికి చెందిన సుత్రాల వరుణ్‌కుమార్‌తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.

అతను ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్‌లోని సాయిబాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వరుణ్‌కుమార్‌ మద్యానికి బానిసై, తన ఆస్తులు కరిగించేశాడు.చివరకు భార్య నగలు కూడా తాకట్టు పెట్టాడు. నిత్యం మద్యం మత్తులో భార్యతో గొడవపడుతూ, హింసించేవాడు. ఈ నెల 5న రాత్రి దంపతుల మధ్య నగలు విడిపించే విషయంలో గొడవ జరిగింది. దీంతో వరుణ్‌కుమార్‌ కోపోద్రిక్తుడై, ఆమెను గొంతునులిమి చంపేశాడు.

అనంతరం ఫ్యాన్‌కు ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. వరలక్ష్మి మృతిపై అనుమానం ఉందని, ఆమెను భర్తే హత్య చేశాడని, ఇందుకు అతని కుటుంబసభ్యులు సహకరించారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. శుక్రవారం అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన త్రీటౌన్‌ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement