ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలి

Jul 30 2026 1:33 AM | Updated on Jul 30 2026 1:33 AM

కామారెడ్డి క్రైం: జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఆనందరావు బుధవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సంగ్వాన్‌ను కలిసి జిల్లాలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై విస్తృత తనిఖీలు నిర్వహించి కల్తీ ఆహారాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. రెసిడెన్షియల్‌ హాస్టళ్లు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన వంటశాలల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు సురక్షితమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి ఫుడ్‌ సేఫ్టీ అధికారిని ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపడతామని రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఆనందరావు తెలిపారు. సమావేశంలో నిజామాబాద్‌ గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత, కామారెడ్డి ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ విక్రమ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి క్రైం: జిల్లాలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ బుధవారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని పేర్కొన్నారు. వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్‌ తీగల సమీపంలో ఉండరాదని సూచించారు. కలుషితమైన ఆహారం, తాగునీటిని ఉపయోగించకుండా ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో 24 గంటలు పనిచేసేలా జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహా అవసరమైన సహాయక చర్యలకు అన్ని శాఖలను సిద్ధంగా ఉంచామని వివరించారు. వరదలు, భారీ వర్షాలతో ఏమైనా ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే అధికారులకు గానీ, కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 84682 20069 కు గానీ, డయల్‌ 100 కు గానీ సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement