జోరందుకున్న వ్యవసాయ పనులు.. | - | Sakshi
Sakshi News home page

జోరందుకున్న వ్యవసాయ పనులు..

Jul 30 2026 1:33 AM | Updated on Jul 30 2026 1:33 AM

జోరందుకున్న వ్యవసాయ పనులు..

ల్‌నినో ప్రభావంతో దాదాపు నెలన్నర కాలంగా సరైన వర్షాల్లేక బోసిపోయిన జలవనరులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకున్నాయి. మూడు రోజుల్లో కలిపి జిల్లాలో 114.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొన్నటి దాకా సాధారణ వర్షపాతంకన్నా 18 శాతం లోటు ఉండగా.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 7 శాతం అధిక వర్షపాతం జాబితాలోకి చేరింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అంటే 24 గంటల్లో జిల్లాలో సరాసరిన 61.6 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా జుక్కల్‌ మండలంలో 101 మి.మీ. వర్షం కురిసింది. బుధవారం రోజంతా కురుస్తూనే ఉంది.

జలకళ..

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం 6.4 టీఎంసీల నుంచి 7.139 టీఎంసీలకు చేరింది. నిజాంసాగర్‌ మండలంలో నల్లవాగు మత్తడికి భారీగా వరద వస్తుండడంతో అలుగుపై నుంచి పొంగి పొర్లుతోంది. మహ్మద్‌నగర్‌ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌లోకి వరద వస్తోంది. మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు, లింగంపేట మండలంలోని పెద్దవాగుతోపాటు పలు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. లింగంపేటలోని పాములవాగు ప్రవహిస్తుండడంతో తాత్కాలికంగా వేసిన మొరం కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. భారీ వర్షం కురిస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డిలవైపు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. పాల్వంచ వాగు పాత బ్రిడ్జిపైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో అటువైపు వాహనాలు వెళ్లకుండా అడ్డుగా ట్యాంకర్‌ ఉంచారు.

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు మరింత ఊపందుకున్నాయి. మొన్నటివరకు వరి సాగు విషయంలో వెనకడుగు వేసిన రైతులు.. ఇప్పుడు నాట్లు ముమ్మరం చేశారు. బుధవారం నాటికి జిల్లాలో 2.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ సీజన్‌లో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. వర్షాభావ పరిస్థితులతో కాస్త వెనకడుగు వేశారు. ప్రభుత్వం కూడా వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేయాలని సూచించింది. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వరి నాట్లలో మునిగిపోయారు.

పరవళ్లు తొక్కుతున్న వాగులు

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు,

చెరువుల్లోకి చేరుతున్న నీరు

లోటు నుంచి అధిక వర్షపాతంలోకి..

మూడు రోజుల్లో మారిన పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement