తొలగింపులు ఇలా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓ టరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 71,719 మంది ఓట్లను జాబితానుంచి తొలగించారు. ఇందులో మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటికి మించి ఓట్లు ఉన్న ఓటర్ల వివరాలున్నాయి.
జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 6,96,006 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 6,06,974 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 87.21 శాతం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో 71,719 మంది ఓట్లు తొలగించారు. జిల్లాలో ఇంకా సుమారు 20 వేల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాలు సేకరించి వాటిని డిజిటలైజ్ చేయాల్సి ఉంది. కాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రకటించారు.
నియోజకవర్గాల వారీగా...
జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2,06,343 ఓట్లు ఉండగా.. 1,85,151 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. ప్రక్రియ 89.73 శాతం పూర్తయ్యింది. 19,893 మంది ఓట్లు వివిధ కారణాలతో రద్దయ్యాయి. ఇందులో 5,047 మంది చనిపోయిన వారు, 8,148 మంది శాస్వతంగా షిఫ్ట్ అయిన వారు, 3,897 మంది డబుల్ ఓట్లలో ఒక చోట నమోదు చేసుకున్న వారు, 2,764 మంది ఆచూకీ లేని ఓట్లతో పాటు 37 మంది వివరాలు ఎక్కడా దొరకలేదు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 274 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2,28,503 మంది ఓటర్లకు గాను 2,06,214 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ప్రక్రియ 90.25 శాతం పూర్తయ్యింది. అయితే ఇక్కడ 22,289 మంది ఓట్ల తొలగింపుతో నూరు శాతం ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు పేర్కొన్నారు. 7,615 మంది చనిపోగా, 9,314 మంది శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారు. 4,832 మంది రెండు చోట్ల ఉండి ఎక్కడో ఒక చోట నమోదు చేసుకున్నారు. 509 మంది ఆచూకీ దొరక్కపోవడం, 19 మంది వివరాలు సరిగా లేకపోవడంతో రద్దయ్యాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో 267 పోలింగ్ బూత్‌ల పరిధిలో 2,62,160 మంది ఓటర్లకుగాను 2,15,609 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా 82.56 శాతం ప్రక్రియ పూర్తయ్యింది. ఇక్కడ 29,537 ఓట్లను వివిధ కారణాలతో తొలగించారు. ఇందులో 8,136 మంది చనిపోయిన వారి ఓట్లు, 11,548 మంది శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారు, 8,044 మంది రెండు చోట్ల ఉండి ఏదో ఒకచోట ఎన్‌రోల్ చేసుకున్న వారు ఉన్నారు. 1,784 మంది ఓట్ల వివరాలు దొరకకపోవడం, 25 మంది వివరాలు సరిగా లేకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు.
జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కలిపి 20,798 మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించారు. అలాగే శాశ్వతంగా వలసవెళ్లిన ఓటర్లు 29,010 మంది ఉన్నారు. దీంతోపాటు ఒకటికి మించి ఓట్లు ఉన్నవారు చాలా మంది ఉండగా.. సర్ కారణంగా ఏదో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా 16,773 మంది తమ రెండో ఓటును తొలగించుకున్నారు. 5,057 మందికి సంబంధించిన సంబంధించిన వివరాలు లేవు. మరో 81 మందికి సంబంధించిన సమాచారం దొరకడం లేదు. ఇలా మొత్తం 71,719 ఓట్లు తగ్గనున్నాయి.
ఆత్మల ఓట్లకు చెక్ పెట్టిన ‘సర్’..
20,798 మంది మృతుల ఓట్లు డెలిట్
శాశ్వతంగా వలస వెళ్లిన
ఓటర్లు 28,202 మంది..
డబుల్ ఓట్ల తొలగింపులు 16,679..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో
డిజిటలైజేషన్ పూర్తి


