దడ పుట్టించిన బెబ్బులి | - | Sakshi
Sakshi News home page

దడ పుట్టించిన బెబ్బులి

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

చుట్టంలా వచ్చి.. దడ పుట్టించిన బెబ్బులి తోడు కోసం.. ఆహారం కోసం..

మనుషుల జోలికి వెళ్లని పులి..

అనువైన ప్రాంతాలకు..

చుట్టంలా వచ్చి..
ఉమ్మడి జిల్లాలో ఏడాదిగా పెద్దపులి కదలికలు

మ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఏడాదిగా పెద్దపులి సంచారం కనిపిస్తోంది. ఇటు కాచాపూర్‌ నుంచి అటు కమ్మర్‌పల్లి దాకా.. పలుమార్లు సంచరించిన బెబ్బులి పలు ప్రాంతాల్లో మూగజీవాలపై పంజా విసిరి తన ఆకలి తీర్చుకుంది. గతేడాది జూలైలో పులి సంచారం వెలుగు చూసింది. సిరికొండ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మూగజీవాలపై పంజా విసిరింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ‘కెమెరా ట్రాప్స్‌’ ఏర్పాటు చేయగా.. పులి కదలికలు నిర్ధారణ అయ్యాయి. తర్వాత మళ్లీ డిసెంబర్‌లో దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పులి హల్చల్‌ చేసింది. అంబారిపేట, సంగమేశ్వర్‌, కాచాపూర్‌ గ్రామాల శివారులోని పంట చేల వద్ద పలు పశువులపై దాడి చేసి చంపేసింది. అక్కడి నుంచి తిరిగి పాల్వంచ మండలం ఇసాయిపేట మీదుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో సంచరించింది. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో మాచారెడ్డి, సిరికొండ అటవీ రేంజ్‌ల పరిధిలో పులి కదలికలు కనిపించాయి. చివరిసారిగా కమ్మర్‌పల్లి అటవీ ప్రాంతంలో తిరిగినట్టు అధికారులు నిర్దారించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లిందన్నది తేలలేదు.

ఏప్రిల్‌లో మాచారెడ్డి అటవీ రేంజ్‌ పరిధిలో

పులి సంచరించిన ప్రాంతాల మ్యాప్‌ (ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సంచరించిన పులి.. ఎక్కడా మనుషుల మీద దాడి చేయలేదు. ఆకలి తీర్చుకునేందుకు అక్కడక్కడా పశువుల మీద పడుతోంది. సిరికొండ, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, కమ్మర్‌పల్లి తదితర మండలాల్లో పశువులను చంపినట్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలోనే కాదు మైదాన ప్రాంతమైన బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోనూ సంచరించిన పులి.. ఎక్కడ కూడా మనుషులపై పంజా విసరలేదు.

సొంత పరిధి విస్తరించుకునేందుకు, తోడుకోసం పులి కొత్త ప్రాంతాలను ఎంచుకుంటుంది. అడవిలో సహజ ఆహారమైన జింకలు, దుప్పులు, అడవి పందులు లభించకపోతేనే అవి పశువులను వేటాడతాయి. పులులు శాశ్వతంగా స్థిరపడాలంటే విస్తారమైన అడవులు, తగినంత సహజ ఆహార జంతువులు, నీటి లభ్యత, మానవ జోక్యం తక్కువగా ఉండడం, తోడును వెతుక్కునే అవకాశం ఉండాలి. ఈ పరిస్థితులు లేకపోతే మరో అనువైన ప్రాంతానికి వెళ్తుంది. పులి రావడం అనేది ప్రమాద సంకేతం కాదు.

– కొమిరె శంకర్‌, సీనియర్‌ బయాలజిస్ట్‌,

హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ

కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో పెద్ద అడవులు లేనప్పటికీ పొరుగున ఉన్న ఆదిలాబాద్‌, మహారాష్ట్ర అడవులతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాయి. ఈ అనుసంధాన అటవీ ప్రాంతాల ద్వారా పులులు సహజంగా సంచరించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని తడోబా–అంధారి, తిప్పేశ్వర్‌ వంటి పులుల ఆవాసాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినపుడు కొత్త నివాస ప్రాంతాలు, సొంత పరిధి (టెరిటరీ), జత(మేట్‌), తగినంత ఆహారం కోసం తమ జన్మస్థలాన్ని విడిచి కొత్త ప్రాంతాలకు వలస వెళతాయి. ఇది ప్రతి పులి జీవితంలో సహజమైన ప్రక్రియ. మహారాష్ట్ర నుంచి పెన్‌గంగ నది దాటి అనేక పులులు ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించాయి. కొన్ని ఆదిలాబాద్‌ అడవుల్లో స్థిరపడగా, మరికొన్ని కొత్త ప్రదేశాల కోసం ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలల్లో సంచరిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పలుమార్లు సంచరించాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఐదారు దశాబ్దాలుగా పులుల సంచారం అనేది అరుదుగా నమోదవడంతో ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే పులి సంచారం ఆందోళన కలిగించే విషయం కాదని.. ప్రకృతి సమతుల్యతకు సంకేతమని వన్యప్రాణి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పులి సంచారం అసాధారణ ఘటన కాదని, దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నందనడానికి ఇది ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చని అంటున్నారు.

కాచాపూర్‌ నుంచి కమ్మర్‌పల్లి దాకా..

వనాల్లోనే కాదు..

మైదాన ప్రాంతాల్లోనూ సంచారం

ప్రకృతి సమతుల్యతకు సంకేతం

అంటున్న వన్యప్రాణి శాస్త్రవేత్తలు

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement