కామారెడ్డి టౌన్ : మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం అందించి వారి హక్కులను పరిరక్షించడమే నల్సా ‘మనోన్యాయ్’ స్కీమ్–2024 ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో జిల్లా ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ఈ పథకంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి కుటుంబాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక పిల్లల సమస్యలను గుర్తించి, న్యాయ సహాయం కోసం సంస్థతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సహాయం కావాల్సిన వారు నేరుగా లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100 ను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు శ్రీచైతన్య, నాగవేందర్, ఐఈఆర్‌పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను, కళాశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సతీష్, సిబ్బంది శ్రీనివాస్‌చారి తదితరులున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీరా జ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క శుక్రవా రం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స ర్)పై జిల్లా అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంతోపాటు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కామారెడ్డి అర్బన్/కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో బాలబాలికల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ సీజన్–1 పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు రాజు, జగదీశ్, గణేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాట్‌పై జరిగే ఈ పోటీలలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచినవారికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3 వేలు బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు. బెస్ట్ రైడర్, డిఫెండర్, ఆల్‌రౌండర్లకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు. ఆసక్తిగల జట్లు 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 99892 15251, 93987 23882 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కలెక్టరేట్ మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చీకట్లో ఉండిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కార్యాలయాల్లో అంధకారం నెలకొంది. కంప్యూటర్లు పనిచేయక పనులు జరగలేదు.


