‘నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని శ్రీనివాస క్యాంప్‌నకు చెందిన రైతు పుట్ట బాబు నీటి సంరక్షణ కోసం రెండెకరాల విస్తీర్ణంలో చిన్నపాటి చెరువునే తవ్వించారు. 15 ఏళ్ల క్రితం ముందుచూపుతో తవ్వించిన చెరువు.. ఇప్పుడు కష్టకాలంలోనూ నీటిచింతను తీరుస్తోంది. తన భూమిలో కురిసిన వర్షపు నీరంతా ఈ చెరువులోకే చేరేలా పల్లపు ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. సహజ పద్ధతిలో భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు డ్రిప్ ఏర్పాటు చేసుకుని వరితో పాటు ఆయిల్‌పాం వంటి వినూత్న పంటలను పండిస్తున్నారు. మొదట తనకున్న 15 ఎకరాల్లో పంటలు సాగుచేస్తూ.. మూడేళ్లుగా మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. సొంతంగా నిర్మించుకున్న చెరువు గట్టుపై కొబ్బరి, మామిడి, సీతాఫలం, సపోటా వంటి పండ్ల మొక్కలను పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు.


