● హైకోర్టు న్యాయమూర్తులు
● దోమకొండ గడికోట సందర్శన
దోమకొండ: వారసత్వ సంపదను చెక్కు చెదరకుండా కాపాడటం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు టి మాధవిదేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, గాడి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ గడికోటను జడ్జీలు సందర్శించారు. మొదట కోటలోని మహదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గడికోట చరిత్రను జడ్జీలకు ట్రస్టు మేనేజర్ బాబ్జీ వివరించారు. కోటలోని వెంకటపతి భవన్, అద్దాల మేడ, నాట్యశాల, క్లాక్ బంగ్లా తదితర కట్టడాలను జడ్జీలకు చూపించి వాటి ప్రత్యేకతను తెలిపారు. ఇటీవల చారిత్రక వారసత్వ సంపద కింద యునెస్కో అవార్డు వచ్చినట్లు తెలిపారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ గడికోటకు కామినేని వారసులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తూ గతంలో మాదిరిగా తీర్చిదిద్దడంపై అభినందించారు. వారి వెంట నిజామాబాద్ జిల్లా జడ్జి భారతలక్ష్మి, హరీష, కామారెడ్డి జిల్లా జడ్జి ముక్తిద, సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో మధురిమ, ఎంపీవో రవికుమార్, ఎస్‌ఐ ప్రభాకర్ ఉన్నారు.


