● త్వరలో రానున్న నోటిఫికేషన్
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కార్మికులు
కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)లో సుదీర్ఘ విరామం తర్వా త మళ్లీ యూనియన్ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ లేబర్ కమిషనర్‌ను ప్రధాన నిర్వహణ అధికారిగా నియమించగా, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు బూత్‌ల ఏర్పాటు, పోలింగ్ వివరాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ, ఉత్సాహం నెలకొన్నాయి.
రీజియన్ పరిధిలో
2 వేల మంది కార్మికులు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ ఆరు డిపోలు ఉన్నాయి. వీటిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఏడీసీ, సూపర్‌వైజర్లు, డీఎం ఆఫీస్ స్టాఫ్, తదితరులు సుమారు మొత్తం 2వేలకు పైగా మంది ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఔట్ సోర్సింగ్ కార్మికులు మరో వెయ్యి మందికి పైగా ఉన్నారు. కానీ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరగనుంది. కొందరు నాయకులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తూ, కార్మికులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల విషయమై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్‌ను ‘సాక్షి’ సంప్రదించగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని, ఇంకా అధికారికంగా ఉత్తర్వులు, నోటిఫికేషన్ రావాల్సి ఉందని తెలిపారు.


