ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
● మరొకరి పరిస్థితి విషమం
బోధన్ టౌన్: బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బోధన్ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాకాసిపేటకు చెందిన శ్రావణ్(35), అతని మిత్రుడు రాకేశ్ ఇద్దరు కలిసి బైక్‌పై పెగడపల్లి బైపాస్ రోడ్డు నుంచి రాకాసిపేట్‌కు పనినిమిత్తం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. ఈ ఘటనలో శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందగా రాకేశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని స్థానికులు మొదట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బాన్సువాడ: బీర్కూర్ మండలంలోని బీర్కూర్ తండాకు చెందిన మూడు శ్రీనివాస్(19) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాములు శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ తండాకు చెందిన శ్రీనివాస్ కూలీ పని చేస్తుండేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మృతుడి తల్లి మీరాబాయి రెండు వారాల క్రితం ఇంట్లో శ్రీనివాస్‌ను ఒక్కడినే వదిలేసి ఎడపల్లి మండలం దుబ్బాలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి పని నిమిత్తం వెళ్లింది. ఈ నెల 23న తిరిగి ఇంటికి వచ్చిన మీరాబాయికి కుమారుడు శ్రీనివాస్ స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించింది. చుట్టుపక్కల వారి సహాయంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందాడు. మృతుడి తల్లి మీరాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాములు తెలిపారు.


