కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మకై ్క పాలన సాగిస్తున్నాయని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్రవారం వారు పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పదవులు, పంపకాల కోసమే ఒక్కటయ్యాయన్నారు. పంపకాల ఒప్పందంలో భాగంగానే మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను, అలాగే కోఆప్షన్ పదవులను పంచుకున్నారని గుర్తుచేశారు. పంపకాలలో వచ్చిన తేడాల వల్లే గురువారం బల్దియా సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారన్నారు. పట్టణాభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ అడ్డంకి కాదని, దొంగ బిల్లులను మంజూరు చేయడానికే అడ్డుగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత కౌన్సిల్ ఎజెండాలో అనేక అంశాలు తీవ్ర అవినీతికి తావిచ్చేలా ఉన్నాయని, గతంలో తిరస్కరించిన బిల్లులనే మళ్లీ ఎజెండాలో చేర్చి ఆమోదించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. గడువు ముగిసినప్పటికీ పట్టణంలో తైబజార్ పేరిట యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వెంటనే ఆ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బందికి అందించే పరికరాల కొనుగోలు వ్యవహారంలో సుమారు రూ. 8 లక్షల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అధికారులు చెల్లించిన అనేక బిల్లుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్నాయని, వీటిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలను ఎవరైనా డబ్బులకోసం బెదిరిస్తే భయపడొద్దని, స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వస్తే న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, వంశీకృష్ణ, మధు, అరవింద్, లక్ష్మారెడ్డి, ప్రీతి, రేవతి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవినీతి, దొంగ బిల్లులనే
అడ్డుకుంటున్నాం
బల్దియాలో అవినీతిపై విజిలెన్స్,
ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తాం
మీడియాతో బీజేపీ కౌన్సిలర్లు


