● ఆగస్టు 1 నుంచి అంగన్‌వాడీల్లో అమలు
● చిన్నారులకు రోజూ అల్పాహారం
● పోషకాహార లోపం నివారణకు ప్రణాళిక
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చిన్నారుల ఆరోగ్యం, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఆగస్టు మొదటి వారం నుంచి జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 81 వేల చిన్నారులు..
జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూర్, దోమకొండలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1195 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 0–6 సంవత్సరాల వయసు పిల్లలు 81,260 మంది ఉన్నారు. చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు నిత్యం పౌష్టికాహారం అందజేస్తున్నారు. అయితే, కొందరు చిన్నారులు పౌష్టికాహార లోపంతోపాటు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. ఉదయం వేళ ఇంటి వద్ద సరైన ఆహారం తీసుకోకపోవడమేనని అందుకు కారణంగా గుర్తించిన ప్రభుత్వం తొలిముద్ద పథకాన్ని ప్రారంభించింది. పథకంలో భాగంగా చిన్నారులకు అల్పాహారంగా కిచిడీ, ఉప్మా పెట్టనున్నారు. దీంతో అటు పిల్లల్లో పోషక లోపాన్ని నివారించడమే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు పథకం దోహదపడనుంది.


