బాధితులకు సత్వర న్యాయం..
ఎల్లారెడ్డి: చిన్నారులపై లైంగిక వేధింపులు లేదా దాడులు జరిగితే బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు ఇకపై నేరుగా ఫోన్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం
కేంద్ర ప్రభుత్వం పోక్సో ఈ బాక్స్ అనే ప్రత్యేక యూప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఆధ్వర్యంలో పని చేస్తుంది.
బాధిత కుటుంబ గోప్యత కాపాడుతూ..
ఈ మధ్య కాలంలో బాలలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు తరు చూ వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా, కఠినమైన శిక్షలు విధిస్తున్నా బాధితుల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు ఏమి చేయలేకపోతున్నారు. బాధిత కుటుంబాలకు నిందితుల నుంచి బెదిరింపులు, లేదా కేసు పెడితే ఎక్కడ తమ పరువు పోతుందనే భావనతో చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే, వారికి రక్షణ కల్పిస్తూ,వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ ‘పోక్సో ఈ బాక్స్’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. బాధితులు ఫిర్యాదు చేసిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతారు. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జాతీయ స్థాయి అధికారులు నేరుగా పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఫిర్యాదు ఇలా..
● గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోక్సో ఈ బాక్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
● ఎన్‌సీపీసీఆర్ అధికారిక వెబ్‌సైట్‌లోని పోక్సో ఈ బాక్స్ లింక్‌ను ఓపెన్ చేయాలి
● ఇందులో పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా అక్కడ కొన్ని యానిమేషన్ చిత్రాలు ఉంటాయి. బాధితులు జరిగిన వేధింపుల రకాన్ని (ఉదా: స్పర్శ, మాటలు, ఆన్‌లైన్ వేధింపులు మొదలైనవి) ఆ చిత్రాల ద్వారా ఎంచుకోవచ్చు
● బాధితుల పేరు తెలిపే అవసరం లేదు. వయస్సు, నిందితుడి వివరాలు, సంఘటన జరిగిన ప్రాంతం నమోదు చేయాలి.
● ఫిర్యాదు నిర్ధారించడానికి లేదా తదుపరి కేసు అప్‌డేట్స్ కోసం మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది.
● వివరాలన్నీ నమోదు చేశాక సబ్మిట్ బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు నేరుగా ఎన్‌సీపీసీఆర్ గ్రూప్‌నకు చేరుతుంది.
● ఫిర్యాదు నమోదైన రోజు నుంచి 1 సంవత్సరంలోగా కోర్టు విచారణ పూర్తి అవుతుంది.
● బాలలపై జరిగిన వేధింపుల తీవ్రతను బట్టి నేరస్తులకు కనీసం 7 సంవత్సరాల నుంచి గరిష్టంగా ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది.
సమాచారం
పోక్సో ఈ బాక్స్ యాప్‌నకు వచ్చే ఫిర్యాదుల వివరాలను ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి నుంచే బాలలపై వేధింపులు, అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ యాప్ వివరాలు నేరుగా పైఅధికారులకు తెలియజేయబడతాయి. కాబట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగి నిందితులకు శిక్షలు పడతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేరం గురించి తెలిసినా పోలీసులకు చెప్పక పోయినా కూడా నేరంగానే పరిగణింప బడుతుంది.
–రాజిరెడ్డి, సీఐ, ఎల్లారెడ్డి
గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో
పోక్సో ఈ–బాక్స్ యాప్
బాలలపై లైంగిక దాడులు జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే
ఫిర్యాదు నమోదు


