ఆన్‌లైన్‌ చేస్తేనే బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ చేస్తేనే బోనస్‌

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

సన్న వడ్ల బోనస్‌ చెల్లింపుకు

కొత్త నిబంధనలు

విత్తన కొనుగోలు సమయంలోనే

వివరాల నమోదు

బాన్సువాడ రూరల్‌: సన్నరకం వరి పండించే రైతులకు సరైన సమయంలో మద్దతుధర, సకాలంలో బోనస్‌ అందించేందుకు కొత్త నిబంధనలు రూపొందించింది. వర్షాకాలంలో పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. దుకాణదారులకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ కేటాయించి వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని నిర్ధేశించింది. ఈనిబంధనలు పాటిస్తేనే ప్రభుత్వం సూచించిన ఏడురకాలు సాగుచేసిన సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తుందని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.

కొత్త విధానంతో సులువు..

గతంలో రైతులకు బోసన్‌ నగదు జమ అయ్యేందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేది. క్రాప్‌బుకింగ్‌కు సంబంధించిన ఫొటోలు, సర్టి ఫికెట్లు సక్రమంగా లేకపోతే తిరస్కరించేవారు. సిబ్బంది కొరతతో వెరిఫికేషన్‌కు సమయం పట్టేది. కొత్త విధానంతో రైతులకు సులువుగా మారనుంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఫర్టిలైజర్‌ దుకాణంలో ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. సీజన్‌ పూర్తికాగానే రెండు నెలలలోపు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనికోసం రైతులు రిజిస్టర్డ్‌ ఫర్టిలైజర్‌ దుకాణంలో ఆధార్‌కార్డు, పట్టాపాస్‌పుస్తకం, బ్యాంక్‌పాస్‌పుస్తకం జిరాక్సులు సమర్పించి రసీదు తీసుకోవాలి. పంటకోత పూర్తికాగానే ప్రభుత్వం వెరిఫికేషన్‌ చేసి నేరుగా రైతు ఖాతాలో ఎకరాకు రూ.500 చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు బోనస్‌ జమచేస్తుంది.

ఏడు రకాల వంగడాలకు పెరిగిన డిమాండ్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలకు రైతుల నుంచి డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వం ఆర్‌ఎన్‌ఆర్‌–15048, కేఎన్‌యం–1638, బీపీటీ–5204, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్‌, డబ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 7715 వంగడాలకు మాత్రమే బోనస్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement