బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి/లింగంపేట: రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోనాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కాద్లాపూర్ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. సోయాబిన్, కంది విత్తిన 20–25 రోజుల మధ్యలో గుంటకతో అంతర కృషి చేసి మొక్కల వరుసల్లో ఉన్న కలుపును చేతితో తొలగించాలన్నారు. దీంతో నేలతో తేమ నిలిచి వేర్లకు గాలి అందుతుందన్నారు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి, అడవి లింగాల, భిక్కనూర్, తిమ్మారెడ్డి, మత్తమాల గ్రామాలలో రైతులకు ఆరుతడి పంటలపై వ్యవసాయాధికారి రాజాగౌడ్ అవగాహన కల్పించారు. లింగంపేట మండలం సురాయిపల్లి ఆరుతడి పంటలపై వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ అవగాహన కల్పించారు. కూరగాయలు, మొక్కజొన్న, జొన్న, కంది, మినుములు, పెసర్లు తదితర పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు.
డీసెంట్ నోట్ అందజేసిన బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు పలు ఎజెండా అంశాలపై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు బుధవారం డీసెంట్ నోటీసును అందజేశారు. గురువారం నిర్వహించబోయే మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. చాలా వార్డుల్లో డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌన్సిలర్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, రేవతి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
మద్నూర్(జుక్కల్): మండలంలోని తడిహిప్పర్గలో పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశామని అన్నారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.5,400 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


