సమగ్ర పరిశీలన కోసం
ఎల్లారెడ్డి: వీబీ జీ రామ్ జీ పనులపై కేంద్రం ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా నిఘా పెట్టనుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ కేంద్రం ప్రతిష్టాత్మకంగా వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా జరిగే పనులలో పారదర్శకతను పెంచేందుకు, అవకతవకలు, అవినీతి అరికట్టేందుకు డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు.
అవకతవకలను గుర్తించే అవకాశం
వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా చేపట్టే పనులపై ఏఐ టెక్నాలజీ వాడటంతో అవకతవకలను క్షణాల్లో గుర్తించవచ్చు. కూలీలు సమయపాలన పాటించే అవకాశం ఉంటుంది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలన్నీ డిజిటల్ రికార్డుగా ఉండటంతో భవిష్యత్‌లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఉపయోగపడతాయి. గతంలో పనుల కొలతలు తీసుకోవడానికి అధికారులు ఆలస్యం చేయడంతో బిల్లులు ఆగిపోయేవి. డ్రోన్ డేటా ఆధారంగా ఆన్‌లైన్ వెరిఫికేషన్ వేగంగా జరిగి కూలీలకు, పంచాయతీలకు బిల్లులు తొందరగా వస్తాయి.
వీబీజీ రామ్ జీ పథకం ద్వారా చేపట్టబోయే ఉపాధి పనులను సమగ్రంగా పరిశీలించి, అవకతవకలను గుర్తించేందుకు డ్రోన్, ఏఐ టెక్నాలజీని త్వరలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, పరికరాలు మాకు రాలేదు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్‌తో ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నాం.
– వినోద్ కుమార్, ఏపీవో
ఉపాధి పనులపై డ్రోన్
టెక్నాలజీతో పరిశీలన
పనుల గుర్తింపు..
కూలీల హాజరు సులభం
త్వరలోనే జిల్లాలో అమలు


