కామారెడ్డి అర్బన్: విశ్రాంత పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అల్లం ప్రభు భాస్కర్ (77) వృద్ధాప్యం, అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. అల్లం ప్రభు భాస్కర్ చాలా సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖలో కామారెడ్డి ప్రాంతంలో వివిధ హోదాల్లో పని చేశారు. భాస్కర్ మృతికి పలువురు విశ్రాంత ఉద్యోగులు, నాయకులు సంతాపం తెలిపారు.
విద్యుత్ షాక్‌తో ఆవు..
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన లింగాల శంకర్‌కు చెందిన ఆవు గ్రామ శివారులో మేత మేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో షాక్‌తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ. 25 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
రెండు ట్రాక్టర్లు సీజ్
గాంధారి(ఎల్లారెడ్డి) : అటవీ భూమిని ఆక్రమించి సాగుచేస్తున్న భూమిలో దమ్ముచేస్తున్న కేజ్‌వీల్ ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో రమేశ్ సోమవారం తెలిపారు. మండలంలోని గౌరారం బీట్ మేగిపల్లి శివారులో అక్రమంగా అటవీ శాఖ భూమిలో దమ్ము చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను అటవీశాఖ కార్యాలయానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
● లక్ష్మీరావులపల్లిలో తప్పిన ప్రమాదం
మాచారెడ్డి : మండలంలోని లక్ష్మీరావులపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఇంట్లో వర్షపు నీరు విద్యుత్ వైర్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఇంటి యజమాని తుమ్మ సుదర్శన్ స్తంభంపై నుంచి వచ్చే సర్వీస్ వైరును కట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తన భార్య శోభ పేరుపై ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికి అధికారులు దాని ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇంట్లో ఉండాల్సి వస్తోందన్నారు. అధికారులు తనకు ఇందిరమ్మ ఇంటికయ్యే బిల్లు త్వరగా మంజూరు చేయాలని కోరారు.


