● జ్వరం, డయేరియాతో చేరిక
● బెడ్‌లు సరిపోక ఒకే బెడ్‌పై
ఇద్దరికి చికిత్స
మద్నూర్(జుక్కల్): మండలంలోని పలు గ్రామాలకు చెందిన రోగులతో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం జ్వరం, డయేరియాతో బాధపడుతున్న రోగులు ఆస్పత్రిలో చేరారు. వర్షకాలం ప్రారంభమైనందున వాతావరణం మార్పులతో గ్రామాల్లో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాదపడుతు ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు తెలిపారు. సోమవారం మండలంలోని అవాల్‌గావ్, పెద్ద తడ్గూర్, సోనాల, తడి హిప్పర్గా తదితర గ్రామాలకు చెందిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రోగులు రావడంతో బెడ్‌లు దొరకక ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది ఒకే బెడ్‌పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం అందించారు. సోమవారం 200 పైగా రోగులు వైద్యం కో సం వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.


