సెప్టెంబర్ నాటికి మరింత నీటి ఎద్దడి
చెరుకు సాగును ప్రోత్సహిస్తాం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో మార్పులు అనివార్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో రైతులు వేసే పంటల విషయంలో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం, నష్ట నివారణ చర్యలపై సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేకాధికారిణి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, లక్ష్మీకాంతరావుతో కలసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన, విద్యుత్, డీఆర్‌డీఏ, మున్సిపల్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించడంతోపాటు పలువురు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు అలీసాగర్, మాసాని ట్యాంక్, మంచిప్ప రిజర్వాయర్ల నీటినిల్వను తాగునీటి అవసరాలకే వినియోగించాలన్నారు. ప్రాజెక్టులు ఈ సీజన్‌లో నిండే అవకాశం లేదని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలపై దృష్టిపెట్టాలని, అధికారులు సైతం ఆయా పంటల సాగు కోసం ప్రోత్సాహం అందించాలన్నారు. ఆయిల్‌పామ్, జొన్నలు, రాగులు, కంది, కొర్రలు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్‌నినో లాంటి విపత్కర పరిస్థితులను సైతం రైతులు అధిగమించే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ రూపకల్పన నాటి నుంచే లోపాలు ఉన్నాయని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సైతం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వచేస్తే సమస్యలు వస్తాయని చెప్పిందన్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి నీటిని వినియోగించుకునే వీలులేకుండా పోయిందన్నారు.
ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచే అతి తక్కువ వర్షపాతం నమోదైందని జిల్లా ప్రత్యేక అధికారి యోగితా రాణా పేర్కొన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణంకన్నా 48 శాతం తక్కువ వర్షం కురిసిందన్నారు. సెప్టెంబర్ నాటికి నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల మార్పిడికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 72 శాతం పంటల సాగు పూర్తికాగా మిగతా పంటల సాగుకోసం స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు చెప్పారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆయిల్‌పామ్ వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఈ పంటల రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు.
జిల్లాలో చెరుకు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. షుగర్ ఫ్యాక్టరీ సహకార సంఘం పునరుజ్జీవనానికి కృషిచేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులు వర్షాభావ పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సూచించారు. ప్రస్తుత సమయంలో మిశ్రమ పంటల సాగు లాభదాయకమన్నారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో
పంటల మార్పు అవసరం
ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోని నీరు
ప్రస్తుతం తాగు అవసరాలకే..
ప్రాజెక్టులు నిండే అవకాశాలు లేవు
ప్రత్యామ్నాయ పంటల సాగుపై
దృష్టిపెట్టాలి
ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్‌రెడ్డి
హాజరైన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు


