● గతంలో దేశంలోనే నంబర్‌వన్
దవాఖానాగా బాన్సువాడ ఎంసీహెచ్
● నేడు బాలింతల అస్వస్థతతో
అభాసుపాలు
బాన్సువాడ : గతంలో అత్యుత్తమ సేవలతో దేశంలో బెస్ట్ హాస్పిటల్‌గా నిలిచిన బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రి.. బాలింతల అస్వస్థత ఘటనతో అభాసుపాలవుతోంది. బాన్సువాడ ప్రాంతంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో 2018లో బాన్సువాడలో రూ.17 కోట్లతో 100 పడకల మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని నిర్మించారు. 2023లో ఆస్పత్రిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఉత్తమ సేవలు అందడంతో బాన్సువాడ ప్రాంతంతో పాటు జుక్కల్, నారాయణ్‌ఖేడ్, ఎల్లారెడ్డి, మహారాష్ట్రలోని దెగ్లూర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో గర్భిణులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందేవారు. ఎక్కువగా సాధారణ కాన్పులు జరిగేవి. ఆస్పత్రి ప్రారంభించిన ఏడాదిలోనే పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలను అందిస్తున్న దేశంలో ఏకై క ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ) అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1) సొంతం చేసుకుంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆస్పత్రులకే ఈ అక్రెడిటేషన్ ఉండడం గమనార్హం.
ఐదుగురు బాలింతలకు అస్వస్థతతో..
ఎంతో ఘన చరిత్ర ఉన్న బాన్సువాడ ఎంసీహెచ్‌కు ఇటీవల జరిగిన సంఘటన మచ్చలా మారింది. ఈ నెల 9, 10 తేదీలలో బాన్సువాడ ఎంసీహెచ్‌లో ఆపరేషన్లు చేయించుకున్నవారిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌లు రావడంతో వారిని నిజామాబాద్ జీజీహెచ్‌కు.. అక్కడినుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అసలు బాలింతలు అస్వస్థతకు గురికావడానికి కారణాలేంటో వైద్యులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో వాడిన పరికరాలు, మందులను ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్టు వస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. సంఘటనపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కమిటీ సభ్యుడు బాన్సువాడకు వచ్చి ఆపరేషన్ థియేటర్‌లో పరికరాలు, మందుల వివరాల రికార్డులను తనిఖీ చేసి వెళ్లారు. ఒకేసారి ఐదుగురు బాలింతలు అనారోగ్యం బారిన పడడంతో అపరేషన్ థియేటర్‌ను వారం రోజులు మూసి ఉంచారు. బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనతో ఇక్కడ కాన్పులు చేయించుకోవడానికి గర్భిణులు జంకుతుండడం గమనార్హం. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.


