మన ‘సీపీవో’..
వచ్చే విద్యాసంవత్సరంనుంచే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాఠశాలల్లో విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి రక్షణ కల్పించేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అమలు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(సీపీవో) విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 5,711 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని విషయాల్లో సీపీవో ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నారు.
సీపీవోలకు మరిన్ని బాధ్యతలు..
కామారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు గత విద్యాసంవత్సరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జిల్లాలో నాలుగు వందలకుపైగా పాఠశాలల్లో సీపీవోలను నియమించారు. ఇది సత్ఫలితాలు ఇచ్చి బాలికలపై వేధింపులు తగ్గాయి. కామారెడ్డి జిల్లాలో అమలు చేసిన ఈ విధానానికి మరింత మెరుగులుదిద్ది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీవోకు వివిధ బాధ్యతలు అప్పగించనున్నారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, లీగల్ లిటరసీ, చైల్డ్ రైట్స్ క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులకు న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సేవలు, డ్రాపవుట్ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం వంటి చర్యలు తీసుకుంటారు.
రాష్ట్రంలో 4,704 ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు, 35 సొసైటీ గురుకులాలు, 33 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 250 ఎయిడెడ్ స్కూళ్లలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నియమిస్తారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. విద్యార్థినులు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తినపుడు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగానికి సమాచారం అందించి వారితో కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాల్సి ఉంటుంది. ఎవరైనా ఇబ్బందిపెట్టినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో దీన్ని అమలు చేయనున్నారు.
విద్యార్థుల రక్షణ కోసం
జిల్లాలో గతేడాది ఏర్పాటు
సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ మోడల్‌ను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు
5,711 హైస్కూళ్లలో టీచర్లకు
బాధ్యతలు ఇవ్వనున్న ప్రభుత్వం


