నిజాంసాగర్: వర్షాకాలం ఆరంభం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు, గేర్ బాక్సులు, రూప్ వైర్లకు అవసరమైన మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సూచించారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు హెడ్‌స్లూయిస్ జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బృందం పరిశీలించింది. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలు, గేట్ల నిర్వహణ, ప్రాజెక్టు నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భం దోర్జీ గ్యాంబా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు దిగువన వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. గుల్‌దస్తా వద్ద ఎకో టూరిజం పనులు వేగవంతంగా జరుగుతుండడంతో పర్యాటకంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బాన్సువాడ ఎస్‌ఈ దక్షిణామూర్తి, ఈఈ సోలోమాన్, ఏఈలు ఉన్నారు.
‘పోచారం’ సందర్శన
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టును ఆదివారం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సందర్శించారు. ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రధాన కాలువ వెంట నాగిరెడ్డిపేట శివారులో ఉన్న జగ్గనిచెరువును పరిశీలించారు. ఆయనవెంట బోర్డు ఈఈ వేణుగోపాల్, ఇరిగేషన్ ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ అక్షయ్‌కుమార్, పోచారం సర్పంచ్ సంజీవులు, మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, సిబ్బంది యాదగిరి, నర్సింలు తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 7న జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ (రన్స్, త్రోస్, జంప్స్) ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్–8, 10, 12, 14 కేటగిరీలలో బాలబాలికలకు పోటీలుంటాయి. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకుని గురువారం ఉదయం 8గంటలకు ఇందిరా గాంధీ స్టేడియానికి రావాలని సూచించారు.


