బొమ్మను చూసి.. చిత్రం గీసి.. | - | Sakshi
Sakshi News home page

బొమ్మను చూసి.. చిత్రం గీసి..

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

సొంతూర్లో స్థిరపడటం తృప్తిగా ఉంది

సొంతంగానే చిత్రకళలో ప్రావీణ్యం

పెయింటర్‌ నుంచి క్రియేటివ్‌ డైరెక్టర్‌ వరకు ఎదిగిన గోపాల్‌ గౌడ్‌

ఎల్లారెడ్డి: ఆయన ఎవరి వద్ద కుంచె పట్టి చిత్రకళ నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తితో బొమ్మలను వేయడంలో నైపుణ్యం సాధించాడు. మొదట్లో గుళ్లలో దేవుళ్ల చిత్రాలను గీయడం అలవాటుగా మొదలైన చుక్క గోపాల్‌ గౌడ్‌ ప్రస్థానం.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వరకు ఎదిగింది. కైరో(ఈజిప్ట్‌) దుబాయ్‌, ముంబైల్లోని ప్రముఖ అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన చుక్క గోపాల్‌ గౌడ్‌ చిన్న తనం నుంచే స్వగ్రామంలో ఉన్న గుళ్ల గోడల మీద కాలెండర్లలోని చిత్రాలను చూస్తూ శివుడు, ఆంజనేయుడు, రాముడు లాంటి దేవుళ్ల చిత్రాలను గీసేవాడు. ఆయన ప్రతిభ చూసి పలువురు మెచ్చుకునేవారు.

మలుపుతిప్పిన ఇంగ్లిష్‌ లెక్చరర్‌..

ఇంటర్‌ చదువుతున్నప్పుడు ఈయన నైపుణ్యం చూసి ఇంగ్లిష్‌ లెక్చరర్‌ వహీద్‌ జేఎన్‌టీయూ కాలేజీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు గురించి తెలియజేశారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్‌ కాగానే 1979లో ఆ కోర్సులో చేరారు. అక్కడ అధ్యాపకుల పర్యవేక్షణలో పెయింటింగ్‌లో నిష్ణాతుడయ్యాడు. జేఎన్‌టీయూలో పెయింటింగ్‌ కోర్సు పూర్తి కాగానే హైదరాబాద్‌లోని పలు అడ్వర్టయిజింగ్‌ కంపెనీలలో సినిమా పోస్టర్లను పెయింటింగ్‌ చేస్తూ చిత్ర కళాకారుడిగా జీవితం ప్రారంభించారు. అక్కడ నుంచి పదోన్నతిపై బెంగళూరు వెళ్లి అక్కడ ప్రముఖ అడ్వర్టయిజింగ్‌ కంపెనీలైన మా కమ్యూనికేషన్‌, సిస్టాస్‌, చైత్ర, లియోబర్సెడ్‌లో పనిచేశారు. కొద్ది రోజులు ముంబైలో పని చేస్తూ క్యాలెండర్‌ పెయింటింగ్‌ నేర్చుకున్నారు. ఏషియన్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌లో భారత దేశం తరపున బ్యాంకాక్‌లో పోటీలో పాల్గొన్నారు.

అందుకున్న అవార్డులు..

దుబాయ్‌లో ఒక కంపెనీలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ ప్రతిష్టాత్మక బెస్ట్‌ ఐడియా ఆఫ్‌ ఇయర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. యూరప్‌లో క్విట్‌ స్మోకింగ్‌పై జరిగిన పోటీలలో దుబాయ్‌ ఆరోగ్య శాఖ ద్వారా ఉత్తమ పోస్టర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. సేవ్‌ వాటర్‌ అన్న అంశంపై దుబాయ్‌లో జరిగిన పోటీలలో ఉత్తమ షోకేస్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకున్నారు. ప్రముఖ అడ్వర్టయిజింగ్‌ కంపెనీ ఓ అండ్‌ ఎం సంస్థలో ఆయన చేసిన కంపెనీ యాడ్‌కు బంగారు పతకం లభించింది. శివతత్వాన్ని ఇష్టపడే ఆయన ఆధునిక చిత్రకళతో అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌, కాన్వాస్‌ పెయింటింగ్‌, గృహాలంకరణ చిత్రాలలో శివుడిపై ఎన్నో చిత్రాలు గీశారు. ఆయన గీసిన పలు వాణిజ్య ప్రకటనలు, లఘు చిత్రాలు, యాడ్‌ ఫిలిమ్స్‌, మోడ్రన్‌ ఆర్ట్‌ చిత్రాలు ఎన్నో అవార్డులను సాధించి పెట్టాయి. 2025లో హైద్రాబాద్‌లో మంజునాఽథ ఫౌండేషన్‌ వారు భారత్‌ విభూషణ్‌ అవార్డుతో సత్కరించి బంగారు నందిని బహూకరించారు. చిత్రకళలో ఆయన నైపుణ్యాన్ని గుర్తించి సినీ బెల్డియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు, మిస్టర్‌ అండ్‌ మిస్‌ వరల్డ్‌ వంటి అంతర్జాతీయ పోటీలకు న్యాయ నిర్ణేతగా(జ్యూరీ మెంబర్‌) ఎంపిక చేశారు.

పెయింటర్‌గా, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా, క్రియేటివ్‌ హెడ్‌గా ఎన్నో దేశాలలో పనిచేశాను, ఎన్నో దేశాల ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాను. ఎన్ని దేశాలలో పనిచేసినా రిటైర్‌ అయ్యాక నేను పుట్టి పెరిగిన సొంతూరు ఎల్లారెడ్డిలో స్థిర పడటం ఎంతో తృప్తినిస్తోంది. రిటైర్‌మెంట్‌ తర్వాత నా అభిరుచికి తగ్గట్టు ఎల్లారెడ్డిలో చిన్న ఇల్లు కట్టుకుని పెయింటింగ్‌లు వేసుకుంటూ, చిత్రకళపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు, పిల్లలకు పెయింటింగ్‌ నేర్పుతూ నా భార్య సుగుణతో కలిసి శేష జీవితాన్ని గడపడం ఆనందంగా ఉంది.

–చుక్క గోపాల్‌ గౌడ్‌, చిత్రకారుడు, ఎల్లారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement