రెంజల్(బోధన్): ఉమ్మడి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంబంధిత సమస్యలు, ప్రజల్లో అవగాహన లేమి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రైతులు వరి కొయ్యలకు నిప్పంటిస్తుండటంతో మంటలు విస్తరించి చెట్లు, చుట్టు పక్కల పంటలు బూడిదవుతున్నాయి. బీడీ, సిగరేట్ తాగేవారి నిర్లక్ష్యంతో అటవీ ప్రాంతాలు, చెరువు కట్టలు కాలిపోతున్నాయి. తాజాగా ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెంజల్ శివారులో ఆదివారం వరి కొయ్యలు కాలుతూ రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం కుప్పకు అంటుకున్నాయి. రైతులు అప్రమత్తం కావడంతో ధాన్యం కుప్పపై కప్పిన బార్దాన్ దగ్ధమవ్వగా, ధాన్యం కాలిపోకుండా మంటలను ఆర్పివేశారు.
లారీ గ్యారేజీలో..
బాన్సువాడ: పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యారేజీలో ఉన్న లారీ బాడీ కట్టెలకు మొదట మంటలు అంటుకొని క్షణాల్లో గ్యారేజీ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
పంట ఉత్పత్తులు తరలించిన మరునాడే..
బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. రైతులు శనివారం తమ పంట ఉత్పత్తులను తరలించగా ఆదివారం మొక్కజొన్న చేన్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు విస్తరించకుండా ఆర్పివేశారు. స్థానికంగా ఉన్న కోళ్లఫారం వరకు మంటలు విస్తరించడంతో భయాందోళనకు గురైనట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు.
అవాల్‌గావ్ చెరువు కట్టకు..
మద్నూర్: మండలంలోని అవాల్‌గావ్ గ్రామంలోని చెరువు కట్టకు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కట్ట గ్రామానికి సమీపంలో ఉండటంతో మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో సర్పంచ్ మన్యాబాయి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌తో మంటలను ఆర్పివేయించారు. గుర్తు తెలియని వ్యక్తులు పొగ తాగడం ద్వారా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో బట్టల షాపు దగ్ధం
ఎల్లారెడ్డి: షార్ట్ సర్క్యూట్‌తో పట్టణంలోని కనెక్ట్ మెన్స్‌వేర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యజమాని ఆదివారం దుకాణం తెరిచే సరికి పొగలు రావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.


